నవీన్‌తో పెళ్లి జరగలేదు , అంతా ఫేక్ ... నా ఫ్యామిలీకి భద్రత కల్పించండి : డాక్టర్ వైశాలి

By Siva Kodati  |  First Published Dec 10, 2022, 7:15 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. తనకు నవీన్ రెడ్డితో పెళ్లి జరగలేదని.. తన కెరీర్ నాశనం చేశాడని వైశాలి కన్నీటి పర్యంతమయ్యారు. 


లాక్‌డౌన్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ నవీన్ రెడ్డితో పరిచయమైందన్నారు డాక్టర్ వైశాలి. కిడ్నాపర్ల చెర నుంచి ఆమె క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అనంతరం ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. హెల్ప్ అని అరుస్తుంటే చాలా ఘోరంగా ట్రీట్ చేశారని చెప్పారు. నవీన్‌తో తనకు ఫ్రెండ్‌షిప్ మాత్రమే వుందని.. తన కెరీర్ నాశనం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ రెడ్డితో తనకు పెళ్లి జరగలేదని వైశాలి క్లారిటీ ఇచ్చారు. కారులో గోళ్లతో గిచ్చారని, కొరికారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రిని చంపేస్తానని బెదిరించారని.. ఇష్టం లేదన్నా వినిపించుకోలేదని డాక్టర్ వైశాలి తెలిపారు. 

తానంటే ఇష్టమని చెబితే.. పేరెంట్స్‌తో మాట్లాడాలని చెప్పినట్లు ఆమె వెల్లడించారు. కారులో నవీన్‌తో పాటు ఆరుగురు వ్యక్తులు వున్నారని వైశాలి తెలిపారు. నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి తన ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి జరిగిందని చెబుతున్న రోజున ఆర్మీ కాలేజీలో డెంటల్ ట్రీట్‌మెంట్‌లో వున్నానని వైశాలి రెడ్డి చెప్పారు. తనతో పది మంది దారుణంగా ప్రవర్తించారని, ఆ పది మంది పట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆమె తెలిపారు. మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి తనపై చేయి చేసుకోలేదని వైశాలి కన్నీటి పర్యంతమయ్యారు. తనను కాకుండా వేరే వాళ్లను ఎలా పెళ్లి చేసుకుంటావని ఘోరంగా కొట్టాడని ఆమె తెలిపారు. 

Latest Videos

పెళ్లికి, ప్రేమకు నో చెప్పానని రోజూ తన ఇంటి ముందుకు వచ్చి న్యూసెన్స్ చేసేవాడని వైశాలి తెలిపారు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశానని.. పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. అప్పుడే చర్యలు తీసుకుని వుంటే ఇప్పుడు ఈ ఘటన జరిగేది కాదన్నారు. అంతమంది వున్నప్పుడే తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, తనకు ఇప్పుడు సెక్యూరిటీ కావాలని వైశాలి డిమాండ్ చేశారు. తన ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకోవాలని చూశాడని, తాను ఒప్పుకోకపోవడంతో తనపై దుష్ప్రచారం మొదలుపెట్టాడని ఆమె ఆరోపించారు. నవీన్ అతని ముఠాను కఠినంగా శిక్షించాలని డాక్టర్ వైశాలి కోరారు. 

click me!