బీఆర్ఎస్‌ను చీల్చేందుకు కొందరు కుట్ర చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. 1969 ఉద్యమంలో 400 మందిని కాంగ్రెస్ కాల్చి చంపిందని సీఎం గుర్తుచేశారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. కాంగ్రెస్ వస్తే దళారీల రాజ్యం వస్తుందని ఆయన హెచ్చరించారు.
బీఆర్ఎస్‌ను చీల్చేందుకు కొందరు కుట్ర చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బోథ్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాజ్యంలో తాగు, సాగునీరు, కరెంట్ సమస్యలేనని గుర్తుచేశారు. రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా అందిస్తున్నామని సీఎం తెలిపారు. వున్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ ఆరోపించారు.
పీసీసీ అధ్యక్షుడు 3 గంటల కరెంట్ ఇస్తే చాలని అంటున్నాడని సీఎం దుయ్యబట్టారు. మిషన్ భగీరథతో మంచి నీటి సమస్యలు తీరాయని కేసీఆర్ తెలిపారు. మూడు గంటల విద్యుత్‌తో పొలం పారుతుందా అని సీఎం ప్రశ్నించారు. కాంగ్రెస్ చరిత్రను ప్రజలు గమనించాలని ..తమ ప్రభుత్వం వస్తే ధరణి తీసేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని ఆయన మండిపడ్డారు.
undefined
ALso Read : కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్ని అబద్దాలైనా చెబుతుంది.. : హరీష్ రావు ఫైర్
1969 ఉద్యమంలో 400 మందిని కాంగ్రెస్ కాల్చి చంపిందని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ వచ్చుడో .. కేసీఆర్ చచ్చుడో అన్నట్లుగా పోరాటం చేశానని కేసీఆర్ వెల్లడించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రావాలని.. ఆలోచించి ఓటు వేయాలని సీఎం సూచించారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని.. ప్రజలకు ఉన్న ఏకైక ఆయుధం ఓటేనని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కార్యకర్తలు, ప్రజలకు వివరించాలని ఆయన పేర్కొన్నారు.
చెరువుల్లో పూడిక తీసి భూగర్భజలాలు పెంచేందుకు కృషి చేశామని.. కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్ల పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని కేసీఆర్ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే సాగునీటిపై పన్ను రద్దు చేశామని.. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా అమలు చేశామని సీఎం పేర్కొన్నారు. ధరణి తీసేస్తే రైతులకు రైతుబంధు , ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. కాంగ్రెస్ వస్తే దళారీల రాజ్యం వస్తుందని ఆయన హెచ్చరించారు.
రైతులు గడప దాటకుండా ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశామని.. ఈ ఎన్నికల్లో మరోసారి గెలవగానే నెల రోజుల్లో బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి పదేళ్లు అయ్యిందని.. దేశంలో 157 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.