ఇప్పటి వరకు మోసాలే.. మూడోసారి అధికారం కావాలట : కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

By Siva Kodati  |  First Published Nov 16, 2023, 3:27 PM IST

పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ పరిస్ధితి ఏంటీ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ .. మళ్లీ మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు.


పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ప్రభుత్వం రావాలంటే దొరల రాజ్యం కూలాలన్నారు. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ పరిస్ధితి ఏంటీ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవి దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. 

ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ .. మళ్లీ మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. మేడ్చల్ కు ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలు తెచ్చిందే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. దొరల తెలంగాణ కావాలో, ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. 

Latest Videos

undefined

ALso Read: తెలంగాణ ఎన్నికలు.. రేపు మేనిఫెస్టోను విడుదల చేయనున్న కాంగ్రెస్ పార్టీ..

ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అయింది. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మేనిఫెస్టోలో అన్ని వర్గాలను ఆకర్షించేలా హామీలు ఉండబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించి టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం.. తీవ్ర కసరత్తు చేసింది. మెగా డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, గల్ఫ్ సంక్షేమ బోర్డు, కళ్యాణ లక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్.. వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని సంక్షేమ పథకాలకు కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చోటు కల్పించే అవకాశం ఉంది. 

click me!