బీఆర్ఎస్ భూముల దోపిడీకి పాల్పడుతోందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. అపద్ధర్మ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల అసైన్డ్ భూములను బీఆర్ఎస్ నేతలు వారి బినామీల పేరుతో ట్రాన్స్‌ఫర్ చేసే కసరత్తు చేస్తున్నారని భట్టి ఆరోపించారు.
బీఆర్ఎస్ భూముల దోపిడీకి పాల్పడుతోందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణిని అడ్డుపెట్టుకుని అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. రూ. లక్షల కోట్ల విలువైన భూములు ప్రజలకు, ప్రభుత్వానికి చెందకుండా పోయే ప్రమాదం వుందన్నారు. ఎన్నికల కమీషన్‌కు కూడా ఫిర్యాదు చేయబోతున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే లోగా ప్రస్తుత అపద్ధర్మ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల అసైన్డ్ భూములను బీఆర్ఎస్ నేతలు వారి బినామీల పేరుతో ట్రాన్స్‌ఫర్ చేసే కసరత్తు చేస్తున్నారని భట్టి ఆరోపించారు.
గత నాలుగైదు రోజులుగా తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేస్తున్నారని విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే పనులు చేయొద్దని ఆయన అధికారులకు సూచించారు. బీఆర్ఎస్ నేతల ట్రాప్‌లో పడొద్దని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని దీవించారని, ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని తేలిందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.
ALso Read: Revanth Reddy : అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే .. రేవంత్ రెడ్డి నివాసానికి భద్రత పెంపు
మరో సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌ను ఖాళీ చేసే పనిలో కేసీఆర్ వున్నారని ఆరోపించారు. సుమారు రూ.300 కోట్లను ఫాంహౌస్‌కు తరలిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు గుంజి కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.