సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ పై రెండు మూడు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ పై సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ కుంభకోణంలో పాత్రధారులను అరెస్ట్ చేసేందుకు సీఐడీ రంగం సిద్దం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో తొలుత సీఎం రిలీఫ్ ఫండ్ స్కాం ను గుర్తించారు. ఇదే తరహలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను స్వాహా చేశారని గుర్తించారు అధికారులు. దీంతో తొలుత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో గత ఏడాది ఏప్రిల్ మాసంలో కేసు నమోదైంది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది ప్రభుత్వం.
సీఐడీ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఇదే తరహాలో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను స్వాహా చేశారని సీఐడీ అధికారులు గుర్తించారు. మిర్యాలగూడలో జరిగిన స్కాంకు సంబంధించి ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందితో పాటు నరేష్ అనే కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ రోగులు, నకిలీ బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను స్వాహా చేసినట్టుగా సీఐడీ గుర్తించింది. ఈ బిల్లులు అన్నీ ఒకే రకంగా ఉండడంతో అనుమానం వచ్చిన సీఎం కార్యాలయ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ చేస్తే సీఎం రిలీఫ్ పండ్ నిధులను స్వాహా చేసేందుకు కుట్ర చేశారని తేలింది. తొలుత మిర్యాలగూడలో ఘటనపై విచారించిన తర్వాత రాష్ట్రంలోని మిగిలిన 10 జిల్లాల్లో కూడ విచారించారు.
స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల సిఫారసుల లేఖల సహాయంతో సీఎం రిలీఫ్ ఫండ్ పొందారు. రెండు మూడు రోజుల్లో మరికొందరు కీలక పాత్రధారులు, సూత్రధారులను ఈ కేసులో సీఐడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.