హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు సీఎం కేసీఆర్. లాక్‌డౌన్ కు సంబంధించి సడలింపులు ఇవ్వాలా వద్దా అనే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఎనిమిది రోజుల వ్యవధిలో రెండోసారి కేబినెట్ సమావేశం నిర్వహించతలపెట్టడం గమనార్హం.
తెలంగాణ మంత్రి వర్గం ఈ నెల 11వ తేదీన సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. లాక్‌డౌన్ ను ఈ నెలాఖరుకు పొడిగిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకొన్నారు.
అయితే ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. అయితే ఈ నెల 20వ తేదీ తర్వాత కొన్ని రంగాలకు షరతులతో కూడిన మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.
అయితే ఈ తరుణంలో రాష్ట్రంలో కూడ ఈ నెల 20వ తేదీ తర్వాత ఆంక్షలపై సడలింపులు ఇవ్వాలా వద్దా అనే విషయమై కేబినెట్ చర్చించనుంది.తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్ కేసులు 514 వరకు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.
also read:
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ వి. తులసీరామ్ కన్నుమూత
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 170 హాట్ స్పాట్స్ ఉన్న జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలో కేవలం ఆరు కరోనా కేసులు మాత్రమే నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.
ఈ పరిస్థితులన్నీ గమనంలో ఉంచుకొని కరోనా లాక్ డౌన్ సడలింపుల విషయమై కేబినెట్ చర్చించనుంది. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో నిర్వహించనున్నారు.
హాట్ స్పాట్స్ గా ఉన్న జిల్లాలకే లాక్ డౌన్ ను పరిమితం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా, సడలింపులు ఇవ్వకుండా కొనసాగించాలా అనే విషయమై కేబినెట్ లో చర్చించనున్నారు.