
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలనూ బీజేపీలో చేరాలని పిలుపు ఇచ్చారు. ప్రధాని మోడీ కారణంగా నేడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్నదని అన్నారు. ఈ నెల 27వ తేదీన ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని వివరించారు.
ఖమ్మంలోని వీవీసీ ఫంక్షన్ హాల్‌లో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం ప్రధాని మోడీపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు.
నేడు మోడీ పాలనలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. తమ ప్రధాన ఎజెండా దేశం అని వివరించారు. ఇదిలా ఉండగా కమ్యూనిస్టులు సీఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికి పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క ఎంపీ కూడా లేని కమ్యూనిస్టు పార్టీలు బీజేపీని ఎలా గద్దె దింపుతాయని ప్రశ్నించారు. దేశంలో త్వరలోనే కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగైపోతాయని జోస్యం చెప్పారు.
Also Read: Rahul Gandhi: ఓడిన చోటే నిలబడి.. అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీ! కేంద్రమంత్రితో ఢీ?
అంతేకాదు, కమ్యూనిస్టు కార్యకర్తలు ఎర్ర జెండా పార్టీలను వీడి బీజేపీలో చేరాలని పిలుపు ఇచ్చారు. తమకు పెద్ద పెద్ద నేతలు ఏమీ అక్కర్లేదని, గ్రామాల నుంచి పట్టణాల వరకు తమకు కార్యకర్తలు ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందటి మూడు నెలల్లో ఖమ్మంలో చాలా మార్పులు వస్తాయని, ఈ జిల్లాలోని చాలా మంది బీజేపీలో చేరడానికి ఆశపడుతున్నారని వివరించారు.