ప్రభుత్వ భూములు అమ్మే హక్కు ఎవరికీ లేదు: కోర్టు తీర్పుపై విజయశాంతి స్పందన

By Siva Kodati  |  First Published Jul 14, 2021, 8:12 PM IST

కేవలం రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలానికి మాత్రమే అనుమతి వుందని విజయశాంతి పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అమ్మే హక్కు ఎవరికీ లేదని వెల్లడించారు. పూర్తి తీర్పు వచ్చే వరు భూములు ఎవరూ కొనవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 
 


భూముల వేలానికి సంబంధించి హైకోర్టు తీర్పుపై స్పందించారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలానికి మాత్రమే న్యాయస్థానం అనుమతించిందన్నారు. హైకోర్టు ఆదేశాలతోనే రేపటి వేలానికి అనుమతి లభించిందని విజయశాంతి చెప్పారు. జిల్లాల్లో భూముల వేలానికి హైకోర్టు అనుమతి ఇవ్వలేదని ఆమె గుర్తుచేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం భూముల వేలం నిలిపివేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు. కేవలం రేపటి వేలానికి మాత్రమే అనుమతి వుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అమ్మే హక్కు ఎవరికీ లేదని విజయశాంతి వెల్లడించారు. పూర్తి తీర్పు వచ్చే వరు భూములు ఎవరూ కొనవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 

అంతకుముందు విజయశాంతికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూములను వేలం వేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే భూముల వేలాన్ని నిలుపుదల చేయాలంటూ విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూముల విక్రయానికి సంబంధించిన జీవో నెం 13ను కొట్టివేయాలని విజయశాంతి పిటిషన్‌లో కోరారు.

Latest Videos

Also Read:హైకోర్టు అనుమతి.. వేలానికి తొలగిన అడ్డంకులు: కోకాపేట భూముల కోసం రంగంలోకి రియల్టర్లు

దీనిపై న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదమున్నందున ప్రభుత్వ భూములు వేలం వేస్తున్నామని ఏజీ  న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంక్ ఏర్పాటుపై పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది

click me!