రాష్ట్రంలో కరోనా తప్పుడు లెక్కలు... కేసీఆర్ ఎందుకిలా చేస్తున్నారంటే: బండి సంజయ్

By Arun Kumar PFirst Published Jun 25, 2020, 7:24 PM IST
Highlights

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని, రాష్ట్రాన్ని కాపాడలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

సిరిసిల్ల: కరోనా కట్టడి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని, రాష్ట్రాన్ని కాపాడలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. గురువారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట కోసం కరోనా లెక్కలను తగ్గించి చెప్తూ అప్రతిష్టను మూట కట్టుకుంటోందని ఆరోపించారు. 

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 5 లక్షల టెస్టులు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో మూడు లక్షల టెస్టులు జరిగాయన్నారు. కరోనా వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని... ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. 

read more  కరోనా దెబ్బ: నిన్న జనరల్ బజార్, నేడు బేగం బజార్ మూసివేత

రాష్ట్ర మంత్రులు పొలాల్లో దిష్టిబొమ్మల్లా మారారని, తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని సంజయ్ విమర్శించారు.    కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల ప్యాకేజీ నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకు చేరడంతో సీఎం జీర్ణించుకోలేకపోతున్నారన్నారని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి నడవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

click me!