నీ పిట్టకథలు, యాసలు, ప్రాసల్ని నమ్మే రోజులు పోయాయ్.. ప్రతీదీ మాపై రుద్దడమేనా : కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

By Siva KodatiFirst Published Aug 25, 2022, 6:50 PM IST
Highlights

రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీలపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటరిచ్చారు. నువ్వేం చేయలేక ప్రతిదానిని కేంద్రం మీద నెట్టిస్తే ప్రజలేం పిచ్చోళ్లు కాదంటూ ఆయన ముఖ్యమంత్రికి చురకలు వేశారు. 
 

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి దొంగ కేసులు పెట్టారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ బండి సంజయ్. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆయన కరీంనగర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. దాడులు చేయించి, అక్రమంగా అరెస్ట్ చేసి కుట్ర చేశారని ఆరోపించారు. నువ్వేం చేయలేక ప్రతిదానిని కేంద్రం మీద నెట్టిస్తే ప్రజలేం పిచ్చోళ్లు కాదంటూ కేసీఆర్‌పై సంజయ్ మండిపడ్డారు. పిట్టకథలు, యాసలు, ప్రాసల్ని జనం ఒకప్పుడు నమ్మారని దుయ్యబట్టారు. ఇవాళ జరిగిన కేసీఆర్ సభ వల్ల బఠాణీలు అమ్ముకునే వాళ్లు కూడా నష్టపోయారంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. 

రంగారెడ్డి జిల్లాకు నువ్వేం చేశావంటూ ఆయన ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 20 శాతం కూడా పూర్తికాలేదని.. దీనికి కారణం ఎవరని బండి సంజయ్ నిలదీశారు. తాను ఏ జిల్లాకు వెళితే.. ఆ ప్రాంతానికి కేంద్రం ఎన్ని కోట్లు ఇచ్చిందో చెబుతున్నానని.. మరి నువ్వేం చెబుతున్నావంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు పొందిన లబ్ధిదారుల లిస్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చింది.. నువ్వు ఎన్ని కట్టించావు, ఎనిమిదేళ్లలో ఎంతమందికి అదనంగా పెన్షన్లు ఇచ్చావని ఆయన నిలదీశారు. అధికారిక కార్యక్రమంలో దేశ ప్రధానిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తారా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. 

ALso REad:ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ.. కొత్తగా మతపిచ్చిగాళ్లు, నిద్రపోతే ప్రమాదమే: కేసీఆర్ వ్యాఖ్యలు

మిషన్ భగీరథ నీరు బాటిల్‌లో పట్టి పంపిస్తానని.. తాగే దమ్ము నీకుందా అని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలకు కృష్ణా జలాల విషయంగా కేసీఆర్ ద్రోహం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 570 టీఎంసీలు రావాలని.. కానీ 299 టీఎంసీలకు అగ్రిమెంట్ చేశారని, అందులోనూ మొత్తం జలాలను వాడుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏపీతో కుమ్మక్కయ్యారని.. నా ఒత్తిడితోనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగిందని బండి సంజయ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారడానికి కేసీఆరే కారణమని.. పంటలు కావాలా, మంటలు కావాలని సీఎం అడుగుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. వరి వస్తే ఉరి అని చెప్పిందెవరు అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

పోటుగాడు, మొనగాడంటూ చెప్పుకున్నారని.. కానీ ఈరోజు సీఎం ఫ్యామిలీ అవినీతిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. ఏ కంపెనీపై ఈడీ దాడులు జరిగినా కేసీఆర్ కుటుంబం పేరే బయటకు వస్తోందని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి కేసీఆర్ ఇవాళ్టీ సభలో ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ 19 రాష్ట్రాల్లో అధికారంలో వుందని.. ఎక్కడా మత ఘర్షణలు జరగడం లేదని బండి సంజయ్ తెలిపారు. మునావర్ దేశభక్తుడా.. మా పేరు చెప్పి మీరు ఘర్షణలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మునావర్ ఫారూఖీని ఎందుకు పిలిపించారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం దృష్టిని మళ్లించడానికే ఘర్షణలు సృష్టిస్తున్నారని  ... మత ఘర్షణలు సృష్టించి బీజేపీపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు చేసినా ఘర్షణలు జరగలేదని బండి సంజయ్ గుర్తుచేశారు. 

click me!