ఈ ఏడాది ఆగస్టు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొంటారు.
భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వంపై విపక్షాలు అస్త్రాలను సిద్దం చేసుకోనున్నాయి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో ప్రజల నుండి వచ్చిన సమస్యలపై ఆయన సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై బీజేపీ కూడ సభలో ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది.మరో వైపు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను కూడ ప్రవేశ పెట్టే అవకాశం లేకపోలేదు.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఈ అసెంబ్లీ సమావేశాలను అధికార,విపక్షాలు సీరియస్ గా తీసుకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ సంస్థకు లీజు ఇచ్చే అంశంతో పాటు భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది.మరో వైపు విపక్షాలకు ప్రభుత్వం కూడ కౌంటర్ ఇవ్వనుంది.భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టిందో వివరించే అవకాశాలు లేకపోలేదు.