వారసులు: తండ్రుల బాటలో ఆదిలాబాద్ నేతలు

By narsimha lodeFirst Published Nov 30, 2018, 12:20 PM IST
Highlights

ఆదిలాబాద్ జిల్లాలో తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని  రాజకీయాల్లో వారసులు రాణిస్తున్నారు


ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని  రాజకీయాల్లో వారసులు రాణిస్తున్నారు. రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకొంటున్నారు. తండ్రులు ఒక పార్టీలో ఉన్నా.. తమ ఉనికి కోసం వారసులు ఇతర పార్టీల్లో కొనసాగుతున్నారు.  కొందరేమో తండ్రి బాటలోనే  కొనసాగుతున్నారు.

మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  రాజకీయాలను శాసించారు. ఆదిలాబాద్ జిల్లాలోని లక్సెట్టిపేట, చెన్నూరు ద్విసభ్య అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1957 లో తొలిసారిగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో వెంకటస్వామి కీలకపాత్ర పోషించారు.

ఆ తర్వాత వెంకటస్వామి సిద్దిపేట నుండి, పెద్దపల్లి నుండి ఎంపీగా విజయం సాధించారు.  పెద్దపల్లి నుండి వెంకటస్వామి మూడు దఫాలు వరుసగా విజయం సాధించారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కూడ వెంకటస్వామి పనిచేశారు. వెంకటస్వామి తనయుడు వినోద్ చెన్నూరు నుండి 1999లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి, టీడీపీ నేత బోడ జనార్ధన్ చేతిలో వినోద్ ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో వినోద్ చెన్నూరు నుండి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.

2009 ఎన్నికల్లో చెన్నూరు నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి నల్లాల ఓదేలు వినోద్ పై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి వినోద్ సోదరుడు వివేక్ విజయం సాధించారు.  ఆ తర్వాత పరిణామాల్లో వీరిద్దరూ టీఆర్ఎస్ లో చేరారు. చెన్నూరు టీఆర్ఎస్ దక్కకపోవడంతో వినోద్ ప్రస్తుతం బెల్లంపల్లి నుండి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వివేక్ పెద్దపల్లి నుండి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.


ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి మూడు దఫాలు, ఖానాపూర్ నుండి భీంరావు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కూతురే కోవ లక్ష్మి. 2010 వరకు ఆమె టీడీపీలో కొనసాగారు. 2014లో ఆసిఫాబాద్ నుండి ఆమె టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.,

నిర్మల్‌కు చెందిన  అయిండ్ల భీంరెడ్డి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1983లో ఆయన టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  ఆయన పెద్ద కూతురు స్వర్ణారెడ్డి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుండి రెండు దఫాలు పాల్వాయి పురుషోత్తమరావు విజయం సాధించారు. మావోయిస్టులు పురుషోత్తంరావును చంపారు. ఆయన మృతితో 1999లో పాల్వాయి రాజ్యలక్ష్మీ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికల్లో సిర్పూర్ నుండి ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల్లో పాల్వాయి రాజ్యలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పురుషోత్తమరావు కొడుకు హరీష్ బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సిర్పూర్ కాగజ్ నగర్ నుండి బరిలో నిలిచారు.

ఆదివాసీ  నేతల్లో గెడం రామారావు  టీడీపీ హయంలో మంత్రిగా పనిచేశారు. బజార్ హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన రామారావు టీడీపీ తరపున బోథ్ నుండి విజయం సాధించారు. రెండు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా పనిచేశారు.

రామారావు రెండో కొడుకు గెడం నగేష్ ఉపాధ్యాయ వృత్తి నుండి రాజకీయాల్లోకి వచ్చారు. గిరిజన శాఖ మంత్రిగా కూడ నగేష్ పనిచేశారు. 2014 లో నగేష్ టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరారు.

ఆదిలాబాద్ ఎంపీగా రెండు దఫాలు పనిచేసిన గడ్డం నర్సింహ్మరెడ్డి తనయుడు అరవింద్ రెడ్డి రాజకీయాల్లో రాణిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. 2009లో మంచిర్యాల నుండి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు దక్కకపోవడంతో అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.

ముథోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి గడ్డెన్న కొడుకు విఠల్ రెడ్డి. ఆరు దఫాలు గడ్డెన్న ఎమ్మెల్యేగా విజయం సాధించారు.గడ్డెన్న పెద్ద కొడుకు విఠల్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు దక్కకపోవడంతో పీఆర్పీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ముథోల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా ముథోల్ నుండి బరిలో దిగారు.

సంబంధిత వార్తలు

నర్సంపేట: మద్దికాయల ఓంకార్‌ రికార్డ్ ఇదీ

ఇల్లెందు: డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

హేమాహేమీల అడ్డా: ఆ ప్రముఖులు ఇక్కడివారే

కారణమిదే: ఆ స్థానంలో ఇంతవరకు టీడీపీ గెలవలేదు

click me!