తన కుటుంబం కోసం తప్ప ప్రజల బాగు కేసీఆర్ కు పట్టలేదని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.
హైదరాబాద్: కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బుధవారంనాడు హైద్రాబాద్ నోవాటెల్ హోటల్ లో రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివేక్ వెంకటస్వామితో పాటు ఆయన తనయుడు వంశీ కూడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం బాగుపడుతుందని అంతా భావించినట్టుగా ఆయన చెప్పారు. కానీ, బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. తమ కుటుంబ ఆకాంక్షల మేరకే కేసీఆర్ పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.టిక్కెట్టు అనేది అంత ముఖ్యం కాదన్నారు. కేసీఆర్ సర్కార్ నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడమే తన లక్ష్యమన్నారు.
తెలంగాణ సాధన కోసం ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అందరం కలిసికట్టుగా కేసీఆర్ ను గద్దె దింపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తామంతా కలిసికట్టుగా ఈ పోరాటంలో పాల్గొంటామని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. టిక్కెట్టు కేటాయింపు విషయమై వివేక్ వెంకటస్వామిని మీడియా ప్రశ్నిస్తే పార్టీ నిర్ణయం ప్రకారం తాను నడుచుకుంటానని తెలిపారు.
also read:బీజేపీకి షాక్: కమలానికి వివేక్ వెంకటస్వామి గుడ్ బై, రాహుల్ తో భేటీ
అంతకు ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు . కాంగ్రెస్ పార్టీలో చేరాలని తాము వివేక్ వెంకటస్వామిని ఆహ్వానించినట్టుగా చెప్పారు. సోనియా , రాహుల్, ప్రియాంకగాంధీలతో వివేక్ వెంకటస్వామి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వివేక్ చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కానుందన్నారు. కీలకమైన సమయంలో వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరారని రేవంత్ రెడడి చెప్పారు.
ఇవాళ బీజేపీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొంత కాలంగా వివేక్ వెంకటస్వామితో కాంగ్రెస్ నాయకత్వం చర్చలు జరుపుతుంది. గత శనివారం నాడు వివేక్ తో రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చర్చలు జరిపారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత వివేక్ వెంకటస్వామి కూడ బీజేపీ నుండి బయటకు వస్తారనే ప్రచారం కూడ సాగింది.