Telangana Elections 2023: భారీగా మ‌ద్యం, డ‌బ్బు స్వాధీనం.. ఎన్ని కోట్ల‌కు చేరుకుందంటే..?

By Mahesh Rajamoni  |  First Published Nov 4, 2023, 1:22 AM IST

Hyderabad: రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు నిర్వ‌హిస్తున్న‌ తనిఖీల‌లో పెద్ద మొత్తంలో బంగారం, మ‌ద్యం, డ‌బ్బు, మాద‌క ద్ర‌వ్యాల‌ను స్వాధీనం చేసుకోగా, అందులోని 6,154 కిలోల గంజాయి, 1,299 కిలోల ఎన్‌డిపిఎస్ విలువ రూ. 27.58 కోట్లుగా ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.
 


Telangana Assembly Elections 2023: తెలంగాణలో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పటి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. గత 24 గంటల్లో తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రూ.15 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం స‌హా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో అధికారుల మొత్తం స్వాధీనం రూ.453 కోట్లకు చేరుకుంది. నవంబర్ 2న ఉదయం 9 గంటల నుంచి నవంబర్ 3వ తేదీ ఉదయం 9 గంటల వరకు రూ.7.98 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం నగదు రూ.164 కోట్లకు చేరింది.

ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9న ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తనిఖీలు ప్రారంభించాయి. 24 గంటల వ్యవధిలో రూ.16 లక్షల విలువైన వివిధ వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇప్పటివరకు 264 కిలోల బంగారం, 1,091 కిలోల వెండితో పాటు వజ్రాలు- ప్లాటినమ్ వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నాయి. వీటి విలువ రూ.165 కోట్లకు పైగా ఉంటుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

Latest Videos

undefined

మద్యం ప్రవాహాలపై నిరంతర చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. కొత్త‌గా రూ. 28.13 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం మ‌ద్యం స్వాధీనం రూ. 52.93 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు 1.21 లక్షల లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  అలాగే, రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలు 62 కిలోల గంజాయి, 169 కిలోల ఎన్‌డిపిఎస్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాయి. మొత్తం స్వాధీనం 6,154 కిలోల గంజాయి, 1,299 కిలోల ఎన్‌డిపిఎస్ ఉండ‌గా, వీటి మొత్తం విలువ రూ. 27.58 కోట్లుగా ఉంటుద‌న్నారు.

అలాగే, 43.86 కోట్ల విలువైన 1.61 లక్షల కిలోల బియ్యం, కుక్కర్లు, చీరలు, ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, మొబైల్ ఫోన్లు, ఫ్యాన్లు, కుట్టుమిషన్లు, గడియారాలు, లంచ్ బాక్స్‌లు, ఇమిటేషన్ ఆభరణాలు, ఇతర వస్తువులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, 119 మంది సభ్యులున్న  తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి శుక్రవారం నామినేషన్ల దాఖలు ప్రారంభం కావడంతో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు నిఘాను మరింతగా పెంచాయి.

click me!