Mallu Bhatti Vikramarka: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారు పాలనలో ఒక ఎంపీకే రక్షణ లేకుంటే సాధారణ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
Adilabad: ఆదిలాబాద్‌లో దళిత యువకుడు రమాకాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించాలనీ, నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలతో విమర్శల దాడి చేశారు. దళితుల బంధు పథకంలో తనకు ప్రయోజనాలు అందడం లేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం బూటకపు వాగ్దానాల కారణంగానే ఇది జరిగిందని ఆరోపించారు. తప్పుడు వాగ్దానాలతో అనేక దళిత కుటుంబాలను కలల ప్రపంచంలోకి తీసుకెళ్లిందని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
కాగా, దళిత బంధు ప్రయోజనాలను పొందలేదని ఆరోపిస్తూ 30 ఏళ్ల దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం గ్రామంలోని అప్రోచ్ రోడ్డులో పడివుండగా, యువకుని ఆత్మహత్యాయత్నానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని మృతుడు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. శుక్రవారం గాంధీభవన్‌లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీ చొరవతో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నిర్లక్ష్య, నిరంకుశ పాలనతో దయనీయ స్థితిలో ఉందన్నారు. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 92 శాతం ఉన్న దళితులు, బీసీలు, ఆదివాసీలు, మతపరమైన మైనారిటీల సంక్షేమం, సంరక్షణ గురించి కేసీఆర్ కనీసం పట్టించుకోవడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. దళితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా బీఆర్‌ఎస్ అధినేత దళితుల ఆశలపై నీళ్లు చల్లారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానన్న హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.
ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి, ఎస్సీ సబ్‌ప్లాన్ అమలు, దళిత బంధు కింద రూ. 10 లక్షల లబ్ధి వంటి బీఆర్ఎస్ వాగ్దానాలు నాన్‌స్టార్టర్‌గా మిగిలిపోయాయని భట్టి విక్రమార్క తెలిపారు. అలాంటి వాగ్దానాలతో దళితులను ప్రలోభపెట్టి వారి ఓట్లు రాబట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని అన్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్‌రావు, కూతురు కవిత రాష్ట్ర నలుమూలలా పర్యటించి తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. "భూమిలేని లక్షలాది దళిత కుటుంబాలు వాగ్దానం చేసిన మూడెకరాల భూమితో తమ జీవితాలు బాగుపడతాయని ఆశతో కలల ప్రపంచంలో జీవిస్తున్నారు. బీఆర్ఎస్, దాని నాయకులు తమను మోసం చేశారని వారు చివరికి గ్రహించారని" అన్నారు.
దళితుల బంధును ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌లో దీని కోసం 17,700 కోట్లు కేటాయింపులు ఉండగా, రూ.300 కోట్లు కూడా ఖర్చు చేయలేదని భట్టి విక్రమార్క నొక్కి చెప్పారు. పాలకులు మానవత్వంతో పరిపాలించాలని పేర్కొన్న ఆయన.. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పాలకులు దళితులపై దారుణమైన నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై హింస పెరుగుతోందని భట్టి విక్రమార్క అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలను పునరుద్ఘాటిస్తూ.. "దొరల తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్య రాబోయే పోరు కొనసాగుతోంది, అయితే, చివరకు ప్రజా తెలంగాణ విజయం సాధిస్తుందని" అన్నారు. రమాకాంత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, పేద కుటుంబానికి సానుభూతి తెలుపుతూ.. దళితులు, ఆదివాసీలు ఆత్మహత్యలు చేసుకునే తీవ్ర చర్య తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రేస్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనీ, సామాన్యుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని అన్నారు. అంతకుముందు, రాష్ట్రంలో ఎంపీకి రక్షణ లేకుంటే సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏఐసీసీ వార్‌రూమ్ ఇన్‌చార్జి అజయ్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.