హైద‌రాబాద్ లో ఎంఐఎం-కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. కేసు న‌మోదు

By Mahesh Rajamoni  |  First Published Nov 4, 2023, 12:24 AM IST

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేసుకుంటున్న‌ ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల దాడులు హ‌ద్దు మీరుతున్నాయి. ఇవి చివ‌ర‌కు భౌతిక దాడుల‌కు కూడా కార‌ణం అవుతున్నాయి. ఇదే త‌ర‌హాలో జ‌రిగిన ఒక ఘ‌ట‌న‌కు సంబంధించి హైద‌రాబాద్ లో కేసు న‌మోదైంది. 
 


Telangana Assembly Elections 2023: శుక్రవారం హైద‌రాబాద్ న‌గ‌రంలోని మలక్‌పేటలో ఏఐఎంఐఎం, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం మాదన్నపేటలోని బాగ్-ఈ-జహనారా ప్రాంతంలో ఏఐఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల‌ కార్యకర్తల ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు. మలక్‌పేట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్, నియోజకవర్గ ఇన్‌చార్జి ముజఫర్ అలీ ఖాన్, ఇతర పార్టీ కార్యకర్తలతో కలిసి మసీదు-ఇ-అయూబీకి చేరుకుని ప్రార్థనలు చేశారు.

అయితే, ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తున్న ప్రజలను కలిసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రయత్నించగా, చావనీ డివిజన్ కార్పొరేటర్ నేతృత్వంలో ఏఐఎంఐఎం కార్యకర్తల బృందం అక్కడికి చేరుకునీ, వారిని అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త‌కు దారితీసింది. ఈ క్ర‌మంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక‌రినొక‌రు తొసుకున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల‌ కార్యకర్తలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లో భాగంగా ఆయా ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహ‌రించారు.

Latest Videos

ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఏఐఎంఐఎం కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుతున్నామ‌ని పేర్కొన్నారు.

click me!