తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిందో లేదో అప్పుడే కొందరు నాయకులు ఓటర్లకు పంచేందుకు రెడీ చేసుకున్న వస్తువులు బయటపడుతున్నాయి.
హైదరాబాద్ : ఒకప్పుడు ప్రజాసేవ చేయాలన్న తపన వుంటేచాలు రాజకీయ నాయకులుగా ఎదిగేవారు.ఇలా మంచితనంతో ప్రజల మెప్పు పొందే స్థాయినుండి కోట్లు పోసి ఓట్లు పొందే స్థాయికి రాజకీయాలు దిగజారాయి. కేవలం ఉపఎన్నికలొస్తేనే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారంటే సాధారణ ఎన్నికల్లో ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోట్లు లేకుంటే ఓట్లు రాలవని రాజకీయ పార్టీలు, నాయకులు నమ్ముతున్నాయి... దీంతో వందలు, వేలకోట్లు ఖర్చుచేస్తున్నాయి. ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా యమ కాస్ట్లీగా వుండేలా కనిపిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడిందో లేదో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు నాయకులు సిద్దమయ్యారు. ఇప్పటివరకు ఓటర్లను మాటలతో తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నించిన నాయకులు సభలు, సమావేశాలను నమ్ముకున్నారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మరోరకంగా ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకు తాయిలాలను సిద్దం చేసుకుంటున్నారు కొందరు పాలిటీషన్స్. కుదిరితే డబ్బులు... లేదంటే ఏదయినా వస్తువులు ఇచ్చి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్దమయ్యారు. ఇలా పంచేందుకు ఓ జాతీయ పార్టీ నాయకుడు ప్రెషర్ కుక్కర్లను సిద్దం చేసి అడ్డంగా బుక్కయ్యాడు.
undefined
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలోనే రాజధాని హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో వెంటనే మాదాపూర్ ఏసిపి శ్రీనివాస్ నేతృత్వంలో పోలీస్ బృందాలు గోపన్ పల్లి తండాలో కాంగ్రెస్ నాయకుడి రాములు నాయక్ ఇంట్లో సోదా చేయగా భారీగా ప్రెషర్ కుక్కర్లు బయటపడ్డాయి. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మారబోయిన రఘునాథ్ యాదవ్ ఫోటోలతో కూడిన 87 కుక్కర్లను గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీడియో
ఓటర్లకు పంచేందుకు ఈ కుక్కర్లను సిద్దం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాములు నాయక్, నర్సింహ లను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నేత రఘునాథ్ యాదవ్ పై కూడా 171ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read More Election Code: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. అంతకు మించి నగదు తీసుకెళ్తే సీజ్..
ఇదిలావుంటే ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోనూ పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులకు రూ.30 లక్షల నగదు పట్టుబడింది. యాక్టివా బైక్ పై వెళుతున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా డబ్బులు పట్టుబడినట్లు... ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఆ డబ్బులతో పాటు యాక్టివాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.