ఎవరేం చేశారో ఆలోచించాలి,విపక్షాల మాయలో పడొద్దు: ఆసిఫాబాద్ సభలో కేసీఆర్

By narsimha lode  |  First Published Nov 8, 2023, 3:55 PM IST

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం  బీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను చేపడతున్న విషయాన్ని కేసీఆర్  వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో  తమ ప్రభుత్వ పథకాలతో పాటు ప్రత్యర్థులపై విమర్శలను ఎక్కు పెడుతున్నారు. 


ఆసిఫాబాద్:వచ్చే ఏడాది మార్చి తర్వాత  ప్రతి రేషన్ కార్డుదారుడికి  సన్నబియ్యం సరఫరా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.బుధవారంనాడు ఆసిఫాబాద్ లో  నిర్వహించిన  బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.  బీఆర్ఎస్ పుట్టిందే  తెలంగాణ కోసమన్నారు.  తెలంగాణ ఏర్పాటు కావడంతోనే  ఆసిఫాబాద్  జిల్లాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. జల్ జంగల్, జమీన్ నినాదంతో  పోరాడిన కుమురం భీం పేరును జిల్లాకు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 

Live: ప్రజా ఆశీర్వాద సభ, ఆసిఫాబాద్ https://t.co/MgkIh0vo59

— BRS Party (@BRSparty)

Latest Videos

 ప్రతిపక్షాల  మాయలో  పడొద్దని ఆయన ప్రజలను కోరారు.   ఎన్నికల సమయంలో  వచ్చే నేతలు, పార్టీలు చెప్పే మాటలను నమ్మొద్దన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేశాయో బేరీజు వేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు, పేదలకు ఏ ప్రభుత్వంలో  మంచి జరిగిందో ఆలోచించాలన్నారు. ఆసిఫాబాద్ లో  మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరైనా ఊహించారా అని  కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి.. కానీ, ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాల్సిన అవసరం ఉందన్నారు.  పోటీలో ఉన్న అభ్యర్ధులు, వారి వెనుక పార్టీల చరిత్రలను గమనించి ఓటేయాలని  కేసీఆర్  కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమన్నారు. ఓటు వేసే సమయంలో  ఆలోచించాలన్నారు.

also read:మరోసారి మొరాయించిన కేసీఆర్ హెలికాప్టర్: రోడ్డు మార్గంలోనే సిర్పూర్ నుండి ఆసిఫాబాద్ కు

వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ కావాలా, 24 గంటల విద్యుత్ కావాలా ఆలోచించాలని కేసీఆర్ ప్రజలను కోరారు.పోడుపట్టాలతో పాటు  రైతుబంధును కూడ  అందించిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. రైతు బంధు వృధా అని కాంగ్రెస్ నేతలు  ప్రచారం చేస్తున్నారన్నారు.  రైతు బంధు ఉండాలా వద్దో తేల్చుకోవాలని ఆయన ప్రజలను ప్రశ్నించారు.రైతుబంధును  రూ. 16 వేలకు పెంచుతామన్నారు. ధరణిని ఎత్తివేస్తే  మళ్లీ రెవిన్యూ అధికారుల పెత్తనం రానుందని ఆయన  చెప్పారు.  ఎవరి భూములపై వారి హక్కులుండేలా చేసిన ధరణి కావాలా... రెవిన్యూ అధికారుల పెత్తనం కావాలో తేల్చుకోవాలని ఆయన  ప్రజలను కోరారు. 

also read:మా పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు: సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రంగా  ఉంటుందని  తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు.  పేదలకు తమ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కొనసాగాలంటే  మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని  తెలంగాణ సీఎం  కేసీఆర్  అభిప్రాయపడ్డారు.

click me!