
హైదరాబాద్ :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో టికెట్ల పంచాయితీ మొదలయ్యింది. ఈసారి ఎన్నికల్లో పోటీకి సిద్దంగావున్న అభ్యర్థులు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. తమకే టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతూనే లేదంటే చెప్పంటి మా దారేదో మేం చూసుకుంటాం అంటూ హెచ్చరిస్తున్నారు. ఇలా అన్నిపార్టీల్లోనూ టికెట్ల పంచాయితీ వుండగా అధికార బిఆర్ఎస్ ఇది కాస్త ఎక్కువగా వుంది. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ఈసారి తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని... లేదంటూ కారు దిగడం ఖాయమని బిఆర్ఎస్ అధిష్టానాన్ని హెచ్చరించారు.
వయసు మీదపడుతున్న నేపథ్యంలో చివరిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నాను... కాబట్టి బిఆర్ఎస్ అధిష్టానం తనకే మహేశ్వరం టికెట్ కేటాయించాలని తీగల కోరారు. మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం లేదుకాబట్టే ఖచ్చితంగా ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని అడుగున్నానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మహేశ్వరం నుండి పోటీచేస్తానని తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేసారు.
బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే తన దారేదో తాను చూసుకుంటునానని తీగల అన్నారు. తన కోడలు అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ గా వుందని... ఒకే కుటుంబంలో రెండు పదవులకు కుదరవని అంటున్నారని తీగల తెలిపారు. కానీ తనకు ఎమ్మెల్యేగా చివరిసారి పోటీచేసే అవకాశం కల్పించాలని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ను కోరుతున్నానని అన్నారు. ఆయనతో సమానంగా రాజకీయాల్లో వున్నానని... సినియారిటీని దృష్టిలో పెట్టుకుని అయినా అవకాశం ఇవ్వాలని తీగల కోరారు.
Read More ఈసారి అసెంబ్లీ బరిలోనే.. మనసులో మాట బయటపెట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా కాంగ్రెసోళ్లను తీసుకువచ్చి మంత్రులను చేసారని... దీంతో తనలాంటి నాయకులు డమ్మీలుగా మారిపోయారని తీగల అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా తమను దూరంపెట్టి ఇతరపార్టీల్లోంచి వచ్చినవారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. సబితా ఇంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రిపదవి ఇచ్చేంత అవసరం ఏమొచ్చిందని తీగల ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సీనియర్లు చాలామంది ఇప్పటికే బిఆర్ఎస్ ను వీడుతున్నారని... అసంతృప్తితో వున్న ఇలాంటి నాయకులకు పిలిచి మాట్లాడాలని తీగల సూచించారు. స్వరాష్ట్రం కోసం పోరాడిన వారిని జైల్లో పెట్టించినవారికి పదవులివ్వడం ఏమిటంటూ బిఆర్ఎస్ అదిష్టానం తీరును తీగల తప్పుబట్టారు.
బిఆర్ఎస్ పార్టీ తనను దూరం పెట్టిందని... జిల్లా మంత్రి సబిత కూడా ఏ కార్యక్రమాలకూ పిలవడం లేదని తీగల అన్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు కూడా తనకు ఆహ్వనం అందలేదన్నారు. ఎలాంటి సమాచారం లేకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని... పార్టీకి తాను దూరంగా వుండటం కాదు పార్టే తనను దూపం పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ పై తనకు నమ్మకం వుందని... మహేశ్వరం టికెట్ తనకే కేటాయిస్తారని భావిస్తున్నానని తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు.