
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 12న తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. కాజీపేటలో రైల్వే శాఖ ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ల పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ (పీఓహెచ్) కేంద్రానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జూలై 12న తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ప్రధాని మోదీ జూన్ నెలాఖరులోగా తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే బీజేపీ శ్రేణుల సమాచారం మేరకు ఆ పర్యటన రద్దయింది. ఇక, తాజాగా జూలై 12న మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల్లో ప్రధాని పర్యటనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, కుటుంబ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘మేరా బూత్.. సబ్‌సే మజ్‌బూత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కుటుంబ పార్టీలపై మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శస్త్రాలను సంధించారు. ‘‘మీరు కరుణానిధి కుటుంబం బాగుండాలంటే.. డీఎంకేకు ఓటు వేయండి. సీఎం కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే.. బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. మీరు మీ కుమారులు, కుమార్తెలు , మనవళ్ల సంక్షేమాన్ని కోరుకుంటే.. మాత్రం బీజేపీకి ఓటు వేయండి’’ అని మోదీ అన్నారు.
‘‘2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయి. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలతో ముడిపడి ఉన్నాయి. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇస్తున్నా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీకి కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ పేర్కొన్నారు. తాము ఏసీ రూమ్ ల్లో కూర్చుని ఆదేశాలు జారీ చేయమనీ, ప్రజలకు చేరువగా ఉంటూ.. వారికి ధైర్యంగా ఉంటామని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటామని తెలిపారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం నెలకొన్ని పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయకపోవడంపై బీజేపీలోని ఒక వర్గం నాయకులను అసంతృప్తిగా ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీ వ్యవహారంపై అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను బీజేపీ అధిష్టానం ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపింది. మరోవైపు ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు.