తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారంనాడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కాసాని జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు సూచించారని సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేయలేమని చంద్రబాబు కాసాని జ్ఞానేశ్వర్ కు తేల్చి చెప్పారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని టీడీపీ గతంలో ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై కూడ పార్టీ కసరత్తును ప్రారంభించనున్నట్టుగా తెలిపింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.
undefined
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించినప్పటికీ ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, జైలులోనే చంద్రబాబు ఉన్న కారణంగా తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేయలేమని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.ఇదే విషయాన్ని చంద్రబాబు కాసాని జ్ఞానేశ్వర్ కు తెలిపారని సమాచారం.
ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో ఈ దఫా పోటీ చేయాలని జనసేన ప్లాన్ చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 20 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని జనసేన నాయకత్వం బీజేపీని కోరుతుంది. అయితే 10 అసెంబ్లీ స్థానాలను జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం సానుకూలంగా ఉంది.
ఇదిలా ఉంటే నెల రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. తాము పోటీ చేయాలనుకున్న 32 అసెంబ్లీ స్థానాల జాబితాను కూడ జనసేన ప్రకటించింది. ఈ స్థానాల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ సహా ఇతర జిల్లాల్లో ఉన్నాయి. బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డిలు ఇటీవలనే సమావేశమైన విషయం తెలిసిందే.