బిజెపి వివేక్ తో రేవంత్ రెడ్డి రహస్య భేటీ .. తెలంగాణ పాలిటిక్స్ మరింత రసవత్తరం

By Arun Kumar P  |  First Published Oct 29, 2023, 9:17 AM IST

తెలంగాణ బిజెపికి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడగా తాజాగా మరో కీలక నాయకుడు వివేక్ టిపిసిసి చీఫ్ రేవంత్ తో రహస్యంగా భేటీ అయ్యాడు.


రంగారెడ్డి : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చేలా కాంగ్రెస్ బలంగా తయారయితే బిజెపి మాత్రం రోజురోజుకు మరింత బలహీనపడుతోంది. కీలక నాయకులు బిజెపిని వీడటం... కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగడం జరుగుతోంది. ఈ క్రమంలో బిజెపి కీలక నాయకుడు వివేక్ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాడు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ చర్చకు దారితీసింది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజాజ్ నగర్ లోని వివేక్  వ్యవసాయ క్షేత్రానికి రేవంత్ రెడ్డి ఒంటరిగానే వెళ్లారు. గన్ మెన్లు కూడా లేకుండానే రేవంత్ బిజెపి నేత వివేక్ వద్దకు వెళ్లడం... ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్నా గంటన్నర సేపు వ్యవసాయం క్షేత్రంలోనే వుండటంపై చర్చ సాగుతోంది. ఇప్పటికే బిజెపిని వీడేందుకు వివేక్ సిద్దమయినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

Latest Videos

వివేక్ ను కాంగ్రెస్ పార్టీలో  చేరాలని రేవంత్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ పార్టీని ఓడించడం  కాంగ్రెస్ తోనే సాధ్యమని... బిజెపితో అది అసాధ్యమని వివేక్ కు వివరించినట్లు సమాచారం. కాబట్టి కేసీఆర్ ను వ్యతిరేకించే వారంతా ఒకే పార్టీలో వుండి పోరాడాల్సిన సమయం ఇది... ఇందుకోసం బిజెపిని వీడి  కాంగ్రెస్ లో చేరాలని వివేక్ ను రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వానంపై వివేక్ కూడా సానుకూలంగా స్పందించినట్లు... త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని రేవంత్ కు తెలిపినట్లు సమాచారం. 

Read More  కాంగ్రెస్ గెలుపు సర్వేల నుండి బిజెపి బిసి సీఎం వరకు : నెటిజన్ల సూటి ప్రశ్నలు, కవిత సమాధానాలివే..

గత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడిన నాయకులు తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. ఇలా ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఇదే బాటలో వివేక్, డికె అరుణ కూడా నడవనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వివేక్ తో రేవంత్ రెడ్డి బేటీ ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. 

ఇదిలావుంటే విజయశాంతి కూడా బిజెపిని వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల కేటాయింపు... బిఆర్ఎస్ విషయంలో బిజెపి తీరుతో ఆమె అసహనానికి గురయినట్లు... అందువల్లే పోటీకి దూరంగా వున్నట్లు సమాచారం. పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్దమన్న ఆమె ఇప్పుడు అసలు పోటీనే చేయడంలేదంటూ ప్రకటించారు. ఇలా బిజెపిపై అసహనంతో వున్న విజయశాంతితో కాంగ్రెస్ నాయకులు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని... ఇందులో పాలుపంచుకోవాలని విజయశాంతిని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారట.

click me!