
టిఆర్ఎస్ లో అధినేత కెసిఆర్ కుటుంబసభ్యుల మధ్య ఒక విషయంలో పోటీ పెరిగిపోతున్నది. పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఆ అన్నాచెల్లెలు ఇద్దరూ పోటీ పడి భారతరత్న డిమాండ్ చేస్తున్నారు. భారతరత్న కోసం ఎవరిష్టమొచ్చినట్లు వారు తమ పేర్లను సిఫార్సు చేయడంతో కార్యకర్తలు అయోమయానికి లోనవుతున్నారు.
టిఆర్ఎస్ పార్టీ తరుపున కానీ లేదా ప్రభుత్వం తరుపున కానీ భారతరత్న కోసం ఎవరి పేరును ఇంకా సిఫార్సు చేయలేదు. ఎవరి పేరు సిఫార్సు చేయాలన్నదానిపై సమగ్రంగా చర్చించి అన్నికోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కార్యకర్తుల అంటున్నారు. ఎవరికి తోచినట్లు వారు తమకు నచ్చిన పేర్లను చర్చకు పెట్టడంతో కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
లంబాడా సమాజం అభ్యున్నతికి కృషి చేసిన రామారావ్ మహారాజ్‌కు భారత రత్నను కేంద్రం ప్రకటించేలా తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చెప్పారు. గత వారం నిజామాబాద్ లోని డిచ్‌పల్లి మండలం దేవా తండాలో జగదాంబ మాత ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం కవిత మాట్లాడుతూ రామారావు మహారాజ్ కు భారత రత్న ను ప్రకటించే అంశం గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. టిఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా కేంద్రానికి లేఖ రాసేలా చూస్తానన్నారు.
తాజాగా ఐటి మంత్రి కెటిఆర్, కవిత అన్న కెటిఆర్ మరో పేరును తెరపైకి తెచ్చారు. తెలుగు వారి నుంచి భారతరత్న ఇవ్వడానికి అసలైన అర్హుడు మాజీ ప్రధాని పివి నర్సింహ్మారావే అని తెలిపారు. పివి కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. పివి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తన డిమాండ్ ను ట్విట్టర్ లో లేవనెత్తారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు పివి అని కొనియాడారు.
కవిత ఒక పేరు ప్రస్తావించడం, కెటిఆర్ మరోపేరు వెల్లడించడంతో ఎవరు సూచించిన వారికి మద్దతివ్వాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇక కెసిఆర్ అల్లుడు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇప్పటి వరకు భారతరత్న డిమాండ్ ను లేవనెత్తలేదు. ఆయన కూడా ఇంకో పేరు లేవననెత్తితే మా తిప్పలు మరింత ఎక్కువవుతాయని కార్యకర్తలు చమత్కరిస్తున్నారు.