సొంతగూటికి ఉమ్మడి నల్గొండ జిల్లా నేత గోపగాని... కాంగ్రెస్‌కు రాజీనామా, త్వరలో BRSలోకి

By Asianet News  |  First Published Jul 21, 2023, 3:14 PM IST

ఉచిత కరెంట్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.  ఈ వ్యాఖ్యలపై చాలా మంది పార్టీ నేతల్లోనూ తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఉచిత కరెంట్ పై అబద్ధాలు, వితండవాదం చేయడం, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు సూర్యాపేట జిల్లా నేత గోపగాని వేణుధర్ గౌడ్ వెల్లడించారు. త్వరలోనే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లోకి వెళ్లబోతన్నట్టు తెలిపారు.


హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను అంగీకరించడం లేదని, ఉచిత విద్యుత్ పై వితండవాదం చేస్తున్నదని మండిపడుతూ సూర్యాపేట జిల్లా నేత గోపగాని వేణుధర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఒప్పుకోకుండా నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని ఆయన విమర్శలు గుప్పించారు. మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో తన మాతృపార్టీ బీఆర్ఎస్‌లోకి చేరుతున్నట్టు ప్రకటించారు.

బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత్ విద్యుత్‌ అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ చిన్నపిల్ల మనస్తత్వంతో చాలెంజ్‌లు విసురుతున్నదని గోపగాని వేణుధర్ గౌడ్ విమర్శించారు. నిజాన్ని అంగీరిచడం లేదని, రైతుల అభివృద్ధినీ కాదంటున్నదని, ఇలాంటి అవాస్తవ ఆరోపణలతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు. గురువారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

Latest Videos

2001 నుంచి తాను అప్పటి టీఆర్ఎస్‌లో ఉండి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందున్నానని వేణుధర్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే విశ్వాసంతో ఆ పార్టీలోకి చేరానని వివరించారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, అర్థసత్యాల వాదనలతో విసుగు చెందినట్టు పేర్కొన్నారు. పార్టీలో వర్గపోరు పెరిగిందని, కొత్త నాయకత్వం వచ్చినప్పటి నుంచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, కాంగ్రెస్ కూడా బీజేపీలాగే నామరూపాల్లేకుండా కొట్టుకుపోతుందని చెప్పారు.

Also Read: లోక్ సభపై సీఎం కేసీఆర్ నజర్.. మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి ఎంపీగా పోటీ ?

ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ అందుబాటులో ఉంటున్నదని, నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ పరిస్థితులతో నేటి పరిస్థితులను ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. 2011-12లో వరి అవుట్ పుట్ వ్యాల్యూ 8291 కోట్లుంటే 2021-22లో 16533 కోట్లకు పెరిగిందని వివరించారు. ఇది ఉచిత కరెంట్ వల్లే సాధ్యమైందని అన్నారు. ఆహార ధాన్యాల్లో చిన్న రాష్ట్రమైనా తెలంగాణ వాటా సుమారుు 14 శాతం అని, పంజాబ్ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉన్నదని వివరించారు. ఉచిత కరెంట్ లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? అని ప్రశ్నించారు. కానీ, కాంగ్రెస్ మాత్రం అవాస్తవాలే చెబుతున్నారని వివరించారు.

ఇదే సందర్భంలో రైతును రాజు చేస్తూ ఉచిత విద్యుత్ ఇస్తూ.. సూర్యపేటను సుందరమైన పట్టణంగా అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని ప్రశంసించారు. ఆయన సమక్షంలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు వెల్లడించారు. ఈ చింత రవి, కాసర్ల సురేందర్ రెడ్డి, వెగ్గలం నాగభూషణ చారి తదితరులు సమావేశంలో హాజరయ్యారు.

click me!