
న్యూఢిల్లీ: గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్టుగా ఈరోజు తెలిపింది. ఇక, చట్టసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చారు.
రాజ్‌భవన్‌లో 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్‌లో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 2022 సెప్టెంబర్ నుంచి నుంచి ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో మూడు బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపినట్టుగా తెలిపింది. గవర్నర్ జాప్యాన్ని చట్టవిరుద్ధం, అక్రమం, రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించాలని పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
రాజ్యాంగం ఆదేశం ప్రకారం.. గవర్నర్ తప్పనిసరిగా బిల్లులను క్లియర్ చేయాల్సి ఉందని పేర్కొంది. బిల్లులపై గవర్నర్‌కు ఏమైనా సందేహాలుంటే.. వారు వివరణలు కోరవచ్చని తెలిపింది. కానీ గవర్నర్ వాటిని తన వద్దే పెండింగ్‌లో ఉంచలేరని పేర్కొంది. గవర్నర్ బిల్లుల విషయంలో ఏవైనా సమస్యలను లేవనెత్తితే తాము వాటిని స్పష్టం చేస్తామని చెప్పింది. గవర్నర్ వాటిని తనవద్ద ఉంచుకోవద్దని.. ఈ విషయంలో రాజ్యాంగం ఆదేశం స్పష్టంగా రాష్ట్రానికి అనుకూలంగా ఉందని తెలిపింది.
అయితే ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణకు రానుండగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఆమోదం పొందిన తర్వాత.. తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడు బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోద ముద్ర వేశారు. రెండు బిల్లులను తిప్పిపంపగా.. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలినకు పంపినట్టుగా తెలుస్తోంది. ఇంకో మూడు బిల్లులను తన వద్దే పెండింగ్‌లో ఉంచారు. పరిశీలన తర్వాత వాటిపై గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.