Hyderabad: గత కొన్ని రోజులుగా హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు నగరవాసులకు ఎంతో ఉపశమనం కలిగించింది. కానీ ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. వచ్చే వారం వేసవి తాపం మరింతగా పెరుగుతుందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.
Rising temperatures in Telangana: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న వారంలో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుందనీ, వేడి గాలులు వీయడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. రానున్న నాలుగు రోజులు తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతూ.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సమాచారం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో ఎండల తీవ్రత పెరగనుంది.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు నగరవాసులకు ఎంతో ఉపశమనం కలిగించింది. కానీ ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. వచ్చే వారం వేసవి తాపం మరింతగా పెరుగుతుందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతల పెరుగుదల తర్వాత గత వారం నగరంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది, అయితే అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఎండలు, ఉక్కపోత నుంచి ప్రజలు చాలా ఉపశమనం పొందారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వాతావరణ శాఖ ప్రకారం, ఏప్రిల్ 10 నుండి తెలంగాణలోని చాలా జిల్లాలతో పాటు జంట నగరాల్లో ఎండల తీవ్రత పెరగనుంది. ఈ వారం వాతావరణం మరింత పొడిగా ఉంటుంది.
వచ్చే వారం వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, దీని ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద వాతావరణం పొడిగా ఉంటుందనీ, అయితే ఏప్రిల్ 11 నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుత వారంలో కూడా కొనసాగవచ్చని ప్రయివేటు సంస్థకు చెందిన వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 23 డిగ్రీల సెల్సియస్ కు పైగా చేరుకుంటాయని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయనీ, నల్గొండ జిల్లా పెద్ద అడిసెర్లపల్లి మండలం ఘన్‌పూర్‌లో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.
నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, పలు జిల్లాల్లో గరిష్ఠానికి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. ఇటీవల కురిసిన వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలతో హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.8-5.8 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గాయి. అయితే, ఈ వారంలో మళ్లీ కొన్ని ప్రాంతాల్లో పెరుగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.