
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష మరణం మిస్టరీని పోలీసులు చేధించారు. ఆమె మరణం పై రకరకాల చర్చలు సాగాయి. హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరిపారు. తాజాగా పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం శిరీష ఆత్మహత్యకు పాల్పడినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
అయితే శిరీష మరణంపై కాసేపట్లో పోలీసులు మీడియా ముందు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు అన్నది ఇంకా వెల్లడించాల్సి ఉంది. రాజీవ్ ఏ మేరకు కారణమయ్యారన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరిపారు. అలాగే రాజీవ్ స్నేహితుడు శ్రావన్ ను విచారించారు.
రాజీవ్ స్నేహితురాలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తేజస్విని ని సైతం సుదీర్ఘంగా విచారించారు. శిరీష మరణం నేపథ్యంలో భయపడి విజయవాడ వెళ్లిపోయిన తేజస్విని సైతం విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. మరోవైపు శిరీష భర్త సతీష్ చంద్ర ను సైతం పోలీసులు విచారించారు. అన్ని కోణాల్లో విచారణ పూర్తయిన తర్వాత కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించనున్నారు. ఒకవేళ శిరీష ఆత్మహత్య చేసుకున్నప్పటికీ... ఆ ఆత్మహత్యకు కారణం ఎవరన్నది కూడా పోలీసులు తేల్చనున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాల ఆధారంగా కేసును నడపనున్నారు.
మరోవైపు శిరీష మరణానికి ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరణానికి మధ్య సంబంధాలున్నాయా లేవా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే వీరిద్దరి మధ్య సంబంధం ఉందని, పోలీసులు తొలుత లీకులు ఇచ్చారు. కానీ వాస్తవాలేంటన్నది ఇంకా తేలాల్సి ఉంది. శిరీష ను ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేశాడని, ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో తన మీదకు వస్తుందన్న భయంతోనే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సూచనప్రాయంగా చెప్పారు. కానీ దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
అసలు ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లనే ప్రభాకర్ రెడ్డి చనిపోయారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంతకంటే ముందు మరో ఇద్దరు ఎస్సైలు సైతం ఆ జిల్లాలో ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు చనిపోయినట్లు విమర్శలున్నాయి. దీంతో ప్రభాకర్ రెడ్డి మరణంపైనా పోలీసుల విచారణ వేగవంతం చేసి వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని జనాలు కోరుతున్నారు.