
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టి, చిన్నతనం నుంచే కూలీ, మేస్త్రీ పనులు చేస్తూనే వలిగొంగ నరసింహ ఉన్నత విద్యను అభ్యసించారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చదువుపై ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు ప్రారంభించి, ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసే స్థాయికి ఎదిగారు. ఇటీవల జరిగిన ఓయూ 85వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ అందుకుని తన పట్టుదలకు మరో మైలురాయి చేర్చుకున్నారు. కష్టాలను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని సాధించిన ఆయన ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన వలిగొండ నరసింహ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యను కొనసాగించారు. ఆయన పాఠశాల విద్య పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే సాగింది. మొదటి నుంచి మూడో తరగతి వరకు నారాయణపురం మండలంలోని కోతులాపురం ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. నాలుగు, ఐదు, ఏడో తరగతులను స్వగ్రామంలోని ఏపూరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. ఆరో తరగతి చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లి పాఠశాలలో చదివారు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో విద్యను కొనసాగించారు.
పాఠశాల విద్య తర్వాత చౌటుప్పల్‌లోని మాతృశ్రీ జూనియర్ కళాశాలలో బైపీసీ విభాగంలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి. రామ్‌రెడ్డి దూర విద్యా కేంద్రం ద్వారా బీఏ చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రముఖ నిజాం కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువుకుంటూనే జీవనోపాధి కోసం కూలీ, మేస్త్రీ పనులు చేయాల్సి వచ్చింది. ఒకవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితులను నెట్టుకొస్తూ, మరోవైపు చదువును కొనసాగిస్తూ ఉన్నత విద్య దిశగా ముందుకు సాగారు.
ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన తర్వాత నరసింహ విద్యార్థి ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా దళిత, బహుజన విద్యార్థుల సమస్యలపై జరిగే ఉద్యమాల్లో భాగస్వామిగా నిలిచారు. ఉద్యమాల్లో పాల్గొంటూనే అకడమిక్‌గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. యూజీసీ-నెట్‌తో పాటు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS-SET)లో అర్హత సాధించి పరిశోధన వైపు అడుగులు వేశారు.
ఓయూ పొలిటికల్ సైన్స్ విభాగంలో డాక్టర్ ఎం. రమణ పర్యవేక్షణలో ‘డిమాండ్ ఫర్ స్టేట్ ఆటానమీ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్: ఏ స్పెషల్ స్టడీ ఆన్ తమిళనాడు స్టేట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కోసం వచ్చిన డిమాండ్లు, అవి దేశ ఫెడరల్ వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని ఆయన తన పరిశోధనలో అధ్యయనం చేశారు. ఈ పరిశోధనకు గాను ఉస్మానియా యూనివర్సిటీ ఆయనకు పీహెచ్‌డీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవం నరసింహ విద్యా ప్రస్థానంలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం. ఎల్లా, ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం చేతుల మీదుగా నరసింహ పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.
తన విజయాన్ని ఆయన తండ్రి దివంగత వలిగొండ మారయ్యకు అంకితం చేశారు. తన చదువు, ఎదుగుదలకు ప్రతి అడుగులోనూ తండ్రి కొండంత అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. తనను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న నరసింహకు డాక్టరేట్ లభించడంపై ఏపూరు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, దళిత-బహుజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టి, కష్టపడి పనిచేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ సాధించిన ఆయన ప్రయాణం.. లక్ష్యంపై పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని చాటిచెబుతోంది.