తెలంగాణ ఇంటర్ పరీక్షలు : సబ్జెక్ట్ ఒకటే, రెండు భాషల్లో వేరు వేరుగా ప్రశ్నలు... అధికారుల తీరుపై ఆగ్రహం

By Siva KodatiFirst Published May 12, 2022, 8:47 PM IST
Highlights

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ప్రతి రోజూ వివాదాస్పద మవుతోంది. తాజాగా గురువారం సెకండియర్ సివిక్స్ పేపర్‌కు సంబంధించి ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో వేరు వేరుగా ప్రశ్నలు వస్తున్నాయి. 
 

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణ గురువారం కూడా వివాదానికి దారి తీసింది. సెకండియర్ సివిక్స్ ప్రశ్నాపత్రానికి సంబంధించి ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో వేర్వేరుగా  ప్రశ్నలు వచ్చాయి. 8వ నెంబర్ ప్రశ్నను వేరుగా ప్రింట్ చేశారు అధికారులు. దీంతో విద్యార్ధులు ఇబ్బంది పడ్డారు. 

కాగా.. తెలంగాణ(inter exams in Telangana)లో ఇంటర్ పరీక్షల నిర్వహణ పూర్తి నిర్లక్ష్యంగా కొనసాగుతోంది. ఎగ్జామ్స్ ప్రారంభమైన రోజు నుంచి నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. నిన్న హిందీ మీడియం (Hindi Medium) విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ పొలిటికల్‌ సైన్స్‌ పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు బోర్డు ద్వారా ప్రింట్ అయిన ప్రశ్నపత్రాలు ఇవ్వకుండా.. చేతితో రాసిన క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం వివాదాస్పదమైంది. హైదరాబాద్‌, నిజామాబాద్ (Nizamabad) లలోని విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఫస్ట్ ఇయర్‌కు 32 మంది, సెకండ్ ఇయర్‌కు 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 

దీనికి సంబంధించి బుధవారం ఉదయం 8.30 గంటలకు క్వశ్చన్ పేపర్స్ బండిల్‌ను అధికారులు తెరిచారు. హిందీ మీడియం పేపర్లు లేకపోవడంతో ఇంగ్లీష్ మీడియం పేపర్లను ట్రాన్స్ లేటర్ తో హిందీలో రాయించారు. దాన్ని జీరాక్స్ తీయించి, విద్యార్థులకు ఇచ్చారు. అయితే విద్యార్థులకు చేతిరాత సరిగా అర్థం కాకపోవడంతో సమయం వృథా అవుతోందని ఆవేదన చెందారు. ఇలా చేతితో రాసి ఇస్తామని ఆయా ప్రిన్సిపాళ్లకు గత మార్చిలోనే సమాచారం ఇచ్చామని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆప్షనల్‌ సబ్జెక్టుల పేపర్లనూ ఇలానే ఇస్తామని పేర్కొన్నారు. 

ఇకపోతే.. తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 6 నుంచి మొదలయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం సంస్కృతంలో రెండు ప్రశ్నలు రిపీటవ్వడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. మరుసటిరోజు జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రెండో ఏడాది సంస్కృతం బదులు హిందీ పేపర్‌ ఇచ్చారు. మరొకరికి హిందీకి బదులు సంస్కృతం ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఇక ప్రశ్నపత్రాల్లో తప్పులు నిత్యకృత్యమయ్యాయి. రోజూ ఇంటర్‌ బోర్డు నుంచి ప్రశ్నలు సరి చేసుకోవాలని తప్పుల సవరణను పంపిస్తూనే ఉండటం గమనార్హం. దీనిపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 

click me!