
హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న మీర్చౌక్లో అర్దరాత్రి గన్ ఫైరింగ్ కలకలం రేపింది. సివిల్ వివాదంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మసూద్ అలీ అనే న్యాయవాది తన లైసెన్సుడ్ గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాలు.. అర్ఫాత్ అనే వ్యక్తి కొన్నిరోజుల క్రితం ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఆ ఇంటిపై కోర్టులో కేసు ఉండగా ఎలా కొంటారని పక్క ఇంటి వారు గొడవకు దిగారు.
ఇదే వ్యవహారంపై ఇరువర్గాలవారు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అలాగే కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంపై ఇటీవల అర్ఫాత్ మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి మసూద్ అలీ.. మూర్ఖుజ మరికొందరితో కలిసి అర్ఫాత్‌తో గొడవకు దిగారు. వారిని భయపెట్టడానికి తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈక్రమంలో ఇరువర్గాలకు చెందినవారు రాళ్లు, కర్రలతో దాడులుచేసుకున్నారు. మహిళలు కూడా కర్రలు పట్టుకుని మాటల యుద్దానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి.
ఈ ఘర్షణకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.