ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న స్ట్రీట్ కాజ్ - వీబీఐటీ

By Mahesh KFirst Published Jun 3, 2022, 9:49 PM IST
Highlights

స్ట్రీట్ కాజ్ - వీబీఐటీ గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడి సమస్యలను తెలుసుకుని తమదైన విధానంలో పరిష్కారాలు చూపిస్తూ వస్తున్నారు. సమాజ అభ్యున్నతిలో తమదైన పాత్ర పోషిస్తూ ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. తాజాగా, ఈ ఎన్జీవో మూడు ప్రాజెక్టులను చేపట్టింది.

హైదరాబాద్: సమాజ అభ్యున్నతికి తమ వంత పాత్ర పోషించాలనే లక్ష్యంతో స్ట్రీట్ కాజ్ - వీబీఐటీ 2011లో ప్రారంభమైంది. ఈ ఎన్జీవో పూర్తిగా విద్యార్థుల నిర్వహణలోనే సాగుతున్నది. వివిధ ప్రాజెక్టులు చేపడుతూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ ఎన్జీవో ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే స్ట్రీట్ కాజ్ - వీబీఐటీ తాజాగా మూడు ప్రాజెక్టులు చేపట్టింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలోని మద్దుకూరు గ్రామంలో కనీస వసతులు కూడా లేని విషయం స్ట్రీట్ కాజ్ - వీబీఐటీ దృష్టికి వచ్చింది. వారు ఆ గ్రామం పర్యటించారు. చుట్టూ అటవీ ప్రాంతం ఉన్న ఆ ఊరిలో 30 కుటుంబాలు జీవిస్తున్నాయి. కానీ, రాత్రి అయితే.. మొత్తం చీకటే. ఎందుకంటే.. ఆ గ్రామానికి విద్యుత్ వసతి లేదు. అందుకే స్ట్రీట్ కాజ్ - వీబీఐటీ చొరవ తీసుకుని అక్కడ సోలార్ లైట్లు అందించారు. ప్రతి ఇంటికి ఒక సోలార్ లైట్ అందించి వారి జీవితాల్లో చీకట్లను కొంతైనా తరిమేశారు. తద్వారా రాత్రిళ్లూ పని చేసుకోవడమే కాదు.. క్రూర మృగాల నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో టీమ్ ప్రెసిడెంట్ రిషబ్ తేజ్, వైస్ ప్రెసిడెంట్లు హర్ష వర్దిని, శ్రావ్య, ట్రెజరర్ యశ్వంత్, ఈబీ మెంటర్ నిఖిత, ఈబీ మెంబర్ ముజాహిద్,  కోఆర్డినేటర్లు ఫనేశ్వర్, అక్షయ్, మనీష్‌లు పాల్గొన్నారు.

ఇదే టీమ్ అశ్వపురం మండలంలోని నెల్లిపాక బంజార గ్రామంలో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ల తయారీ గురించి కనుక్కుని వెళ్లారు. ఎన్ ప్రసాద్ సారథ్యంలో కొందరు మహిళలు ఈ శానిటరీ నాప్కిన్ల తయారు చేస్తున్నారు. ముడి వస్తువులుగా వుడ్ పల్ప్, చెట్టు నుంచి వచ్చే బంక, ఇతర సహజ వస్తువుల నుంచే ఈ శానిటరీ నాప్కిన్లు తయారు చేస్తున్నారు. ఈ టీమ్ అక్కడికి వెళ్లి వారికి ముడి వస్తువులను డొనేట్ చేసి వచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుమ్మలచెరువునూ ఈ బృందం సందర్శించింది. ఇక్కడ పది మందితో కూడిన ఓ మహిళా బృందం పప్పులను ప్రాసెస్ చేసే మిల్లులో పని చేస్తున్నారు. అయితే, ఈ ఉపాధి వారికి యేటా కేవలం ఆరు నెలల్లో మాత్రమే ఉంటుంది. మిగతా ఆరు నెలల్లో ఖాళీగా ఉండాల్సి వస్తున్నది. ఆ గ్రామస్తులు ఎక్కువగా మిరప  పండించి అమ్ముతుంటారు. కాబట్టి, వారికి మిరప కారం పొడిని పట్టే యంత్రాలను స్ట్రీట్ కాజ్ - వీబీఐటీ టీమ్ అందించింది. ఈ యంత్రాలు పసుపునూ ప్రాసెస్ చేస్తాయి. ఈ యంత్రాలను ఆ మహిళలకు అందించారు.  దీంతో ఆ మహిళలు ఈ యంత్రాలతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నారు.

click me!