
జనగామ : తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైర విహారం ఇంకా తగ్గడం లేదు. మనుషుల మీద దాడి చేస్తున్న ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు 23 మంది మీద దాడి చేసి గాయపరిచాయి. కుర్మవాడలోని నాలుగు వార్డుల పరిధిలో, హనుమాన్ స్ట్రీట్ తదితర ప్రాంతాలకు చెందిన స్థానికులు వీధుల్లోకి రావడానికి భయపడుతున్నారు. రోడ్డుపై వెడుతుంటే వీరిని కుక్కలు వెంటాడి దాడి చేశాయి. దీంతో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుక్కలు వెంట పడడం గమనించిన అక్కడ సమీపంలో ఉండేవారు వాటిని రాళ్లు, కర్రలతో కొట్టి వెళ్లగొట్టారు.
దీంతో చాలామంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బాధితులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. కుక్క కాటుకు సంబంధించిన ఇంజక్షన్ ఇచ్చి.. వైద్య సిబ్బంది వారికి సకాలంలో చికిత్స అందింది. ఇక మరో ఘటనలో హైదరాబాదులోని మలక్పేట పద్మా నగర్ కు చెందిన మహమ్మద్ అర్సలాన్ అనే పదేళ్ల బాలుడు రోడ్డు మీద ఆడుకుంటుండగా కుక్క కరిచింది. దీంతో చేతికి గాయాలయ్యాయి. అది గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి బాలుడికి చికిత్స చేయించారు.
ఆహారం పెట్టడానికి వచ్చిన మహిళ మీద కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి..
హనుమకొండ జిల్లా కాజీపేటలో కూడా స్కూలుకు వెళ్లి వస్తున్న 9 ఏళ్ల ముస్తఫా అనే బాలుడిని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క కరిచింది. దీంతో విషయం తెలిసిన బాధితుడు తండ్రి పోలీస్ స్టేషన్లో కుక్క యజమానిమీద ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే, మూగజీవం పట్ల ఓ వ్యక్తి అమానుషంగా వ్యవహరించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో శనివారం ఇస్మాయిల్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ కి ఓ కుక్కను కట్టి రెండున్నర కిలోమీటర్ల మేర ఈడ్చుకువెళ్లాడు. ఈ అమానుష ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. కాగా, ఇస్మాయిల్ తన బండికి కుక్కను కట్టి విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ విహార్ ఔట్ పోస్టు నుంచి వెళుతున్నాడు. అవుట్ పోస్ట్ దగ్గరికి రాగానే స్థానికులు అతడిని గమనించి.. ఆపమని కేకలు వేశారు. అతను వినకపోవడంతో టూ వీలర్ మీద వెంటపడ్డారు. వెంబడించి ఆపారు.
మరికొందరు పీపుల్స్ ఫర్ యానిమల్స్ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని మీద జంతువులను హింసిస్తున్నాడన్న కేసు నమోదు చేశారు. అయితే ఇలా ఎందుకు చేసావు అని ఇస్మాయిల్ ను అడగగా.. ఆ కుక్క చాలా మందిని కరిచిందని తెలిపాడు. అందుకే… దాన్ని తమ ప్రాంతానికి దూరంగా వదిలేయడానికి తీసుకు వెళుతున్నానని పోలీసులకు ఇస్మాయిల్ తెలిపాడు.