
జనగామ: స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ శాసనసభ్యుడు తాడికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తాడికొండ రాజయ్యకు టికెట్ నిరాకరిస్తూ ఆయన స్థానంలో సీనియర్ నేత కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో తాడికొండ రాజయ్య తీవ్రమైన నిరాశకు గురయ్యారు.
టికెట్ రాకపోయినా తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని ఆయన చెప్పారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందయని, ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతా అనుకుంటున్నారని, ఎవరూ రాబోరని ఆయన అన్నారు. ఏమీ జరగదని కూడా ఆయన అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య బుధవారం లింగాలఘనపురం మండలంలో కల్యాణలక్షి చెక్కుల పంపణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ స్థానిక నేతలు రాలేదు. దీంతో రాజయ్య తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కూడా రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమి కొని మొట్లు కొట్టి దుక్కి దున్ని నారు పోసి కలుపు తీసి పండించి కుప్ప పోసిన తర్వాత దాని మీద ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఊరుకుంటామా అని అంటూ నవ్వుతూ నోరు కొట్టుకున్నారు. దేవుడున్నాడని, దేవుడిలాంటి కేసిఆర్ ఉన్నారని ఆయన ఇంతకు ముందు అన్నారు. రేపో మాపో మనం అనుకున్న పని జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసమే తాను ఉన్నానని, ప్రజల మధ్యనే చచ్చిపోతానని ఆయన అన్నారు.
Also Read: అంతా కాలమే నిర్ణయిస్తుంది.. పార్టీ మారడంపై ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు..
తాడికొండ రాజయ్య పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. సర్పంచ్ నవ్య ఆరోపణల నేపథ్యంలో ఆయనపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వివాదాల కారణంగానే రాజయ్యను కేసీఆర్ దూరం పెట్టారని భావిస్తున్నారు. అంతేకాకుండా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య వివాదం రచ్చకెక్కింది కూడా. పరస్పరం బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు.