
శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలంలో శ్రీ సీతారామస్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు కళ్యాణ వేడుక నిర్వహించారు.
ఇందుకోసం మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం పురోహితుల వేద మంత్రోశ్చరణలు, భక్తుల రామ నామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ రాములోరి కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది.
లోక కల్యాణాన్ని తిలకించిన భక్తజనం తన్మయత్వంతో పులకించిపోయారు. స్వామి వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
సీతారాముల కల్యాణ వేడుకను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేసవి కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిథిలా స్టేడియంలో ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేశారు.