
హైదరాబాద్ అల్వాల్‌లో కారు బీభత్సం సృష్టించింది. కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఒక్కరు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే కారు నడిపిన యువతిని కానాజీగూడకు చెందిన శివానిగా గుర్తించారు. ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఆమె కొత్తగా కారు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. గతరాత్రి శివానీ కారు అతివేగంగా రోడ్డు పక్కకు దూసుకొచ్చింది. నలుగురు వ్యక్తులను, రోడ్డు పక్కన ఉన్న రెండు తోపుడు బండ్లను, కరెంట్ పోల్‌ను కారు ఢీకొట్టింది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వెంటనే స్థానికులు స్పందించి.. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో గాయపడిన ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనలో స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్ కూడా ధ్వంసం అయింది. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. కారు డ్రైవ్ చేసిన యువతి శివానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే తాను ఎల్బీ నగర్ నుంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని శివాని తెలిపింది. అయితే తొలుత ఒక బండి అడ్డం వచ్చిందని.. ఆ బండికి కారు తగిలిందని.. అయితే ఆ వ్యక్తికి ఏం కాలేదని చెప్పింది. ఆ తర్వాత తనకు బీపీ డౌన్ అయిందని.. ఏం జరుగుతుందో తెలియకుండా పోయిందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. యువతి బండిని ఢీకొట్టిన తర్వాత కంగారులో బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్‌ను తొక్కడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.