ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు... అధికారులతో స్పీకర్, మండలి ఛైర్మన్ భేటీ

By Siva KodatiFirst Published Sep 4, 2022, 6:43 PM IST
Highlights

మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అధికారులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. 
 

ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అధికారులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా వుందన్నారు. సభ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా సమగ్రంగా చర్చించాలని .. సమావేశాలు సజావుగా జరగడానికి ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖ అధికారులను స్పీకర్ ఆదేశించారు. 

సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌లలో అందుబాటులో వుంచాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ ఆవరణలో కరోనా టెస్టింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని.. సభ్యులకు అవసరమైతే బూస్టర్ డోస్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

ALso REad:ఈ నెల 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

కాగా.. ఈ నెల 6వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు  అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. బీజేపీ శాసనసభపక్షనేత రాజాసింగ్ పై పీడీయాక్ట్ ను నమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రాజాసింగ్ ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఎంఐఎం ఇప్పటికే డిమాండ్ చేసింది.ఈ విషయమై కూడా చర్చించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా బీజేపీ తీరును టీఆర్ఎస్ ఎండగట్టనుంది. 

click me!