
భోజనంలో సరిపోయే కోడికూర వేయలేదని ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. తల్లిదండ్రుల మీద గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ పరిధిలోని తూర్పుతండాలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పుతండాకు చెందిన బానోతు తార్యా, సోమిలికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. పెద్ద కుమారుడు బానోతు శ్రీనుకు 2012లో వివాహం అయినప్పటికీ ఇతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఆరు నెలల్లోనే భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుండి శ్రీను ఏ పనీ చేయకుండా మతిస్థిమితం లేనివాడిలా జులాయిగా తిరుగుతున్నాడు. ఏదైనా పని చేయాలని తల్లిదండ్రులు తరచూ మందలించేవారు.
గురువారం రాత్రి ఇంట్లో కోడి కూర వండారు. శ్రీనుకు ముక్కలు తక్కువగా వేశారని తల్లిదండ్రులను బాగా తిట్టాడు. తరువాత తమ్ముడు, మరదలు ఇంట్లో నిద్రించగా, ఇంటి ముందర తల్లిదండ్రులు, శ్రీను పడుకున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత తలుపు బేడం వేసి గొడ్డలి అందుకున్నాడు. గొడ్డలితో తండ్రి తార్యాను నరికాడు. ఆయన గట్టిగా కేకలు వేయగా భార్య సోమిలి లేచి అడ్డం రావడంతో ఆమె తలపై నరికాడు. ఇంట్లో ఉన్న తమ్ముడు బయటికి రాలేకపోవడంతో చుట్టూ పక్కల వారికి ఫోన్ చేసి రప్పించగా శ్రీను అప్పటికే పరారయ్యాడు.
108 అంబులెన్స్ లో క్షతగాత్రులను సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సోమిలి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. శ్రీనును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అర్వపల్లి ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. ముక్కలు చాలలేదని తల్లిదండ్రుల మీద దాడి చేసిన ఈ ఘటన సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సంచలనం సృష్టించింది.