అకున్ సబర్వాల్ సెలవు రద్దు

First Published Jul 15, 2017, 11:44 AM IST
Highlights
  • విమర్శలకు దిగొచ్చిన సర్కారు
  • అకున్ సబర్వాల్ సెలవు రద్దు
  • డ్రగ్స్ కేసు తర్వాతే పర్వాతరోహననకు అకున్

డ్రగ్స్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్‌సబర్వాల్ తన వ్యక్తిగత సెలవులను రద్దు చేసుకున్నారు. తాను పదిరోజుల సెలవు పై వెళ్లుతన్న తరుణంలో అనేక అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. డ్రగ్ మాఫియా వత్తిళ్ల వల్లే అకున్ సెలవు అని విమర్శలు వినిపించాయి. దీంతో సర్కారు పునరాలోచనలో పడింది. అంతిమంగా తన సెలవును రద్దు చేసుకున్నారు అకున్ సబర్వాల్. సర్కారు సమ్మతించింది.

 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డ్రగ్స్ కేసు కీలక దర్యాప్తు నేపధ్యంలో అకున్ సెలవు పెడితే కేసు నీరుగారిపోతుందేమోనన్న ప్రచారం జరిగింది. డ్రగ్స్‌ కేసు విచారణ పూర్తయ్యే వరకు విధుల్లో ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు అకున్. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సినిమా హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలకు సంబంధం ఉందంటూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొంత మంది జాబితాను సిద్ధం చేస్తోంది ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ. దీంతో సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

 

వ్యక్తిగత కారణాల వల్లనే తాను సెలవు పెట్టినట్లు అకున్ సబర్వాల్ చెప్పినప్పటికీ రాజకీయ వత్తిళ్ల కారణంగానే ఆయన సెలవుపై వెళ్తున్నారంటూ ప్రచారం సాగింది. డ్రగ్ మాఫియా వత్తిళ్లు పనిచేశాయని, అందుకే అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్తున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ అకున్‌సబర్వాల్ పర్వతారోహణకు వెళ్లేందుకుగానూ 10 రోజులపాటు సెలవులు పెట్టినట్లు తెలుస్తోంది.  నయీం కేసు మాదిరిగానే ఈ కేసు కూడా నీరుగారిపోయే అవకాశాలున్నాయని వార్తలు వెలువడ్డ నేపధ్యంలో అకున్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పర్వాతారోహణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ డ్రగ్ కేసు కీలక దర్యాప్తు పూర్తయ్యే వరకు తన సెలవులను రద్దు చేసుకున్నారు అకున్.

click me!