
భద్రాచలంలో ఏటా మాదిరిగానే అంగరంగ వైభవంగా ఈ రోజు రాముడి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో సీతారాముల కల్యాణానికి హాజరయ్యారు.
ఆనవాయితి ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఉదయమే కల్యాణ వేడుక ప్రారంభమైంది. కల్యాణ వేదిక పైకి స్వామి వారు చేరుకున్న అనంతరం ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
కల్యాణంలో భాగంగా పుణ్యాహవాచన కార్యక్రమం నిర్వహించారు. కల్యాణ వేదికపై ఉంచిన జల కలశానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యాహవాచనం అనంతరం కల్యాణ ఘట్టం ఆరంభించారు.
భక్తుల ఆనందోత్సవాల మధ్య సీతమ్మకు మాంగల్యధారణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు అమ్మవారికి భక్త రామదాసు చేయించిన చింతాకు పతకధారణ చేశారు.
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కల్యాణోత్సవానికి హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ అనారోగ్యం కారణంగా కల్యాణోత్సవానికి హాజరుకాలేకపోయారు. ఆయన తరఫున కుటుంబసభ్యులు ప్రత్యేకంగా సీతారాములకు వ్యక్తిగతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.