
సిరిసిల్లలో దళితులపై దాడులకు తెగబడ్డ పోలీసు అధికారుల్లో బుడ్డ పర్క మీద వేటు పడ్డది. కానీ తిమింగలం సంగతేంటో తెలుస్తలేదు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు 20రోజుల తర్వాత తెలంగాణ సర్కారు ఒక్క బుడ్డ అధికారి మీద సస్పెన్షన్ వేటు వేసింది. అంతటితోనే ఆపుతుందా లేక తిమింగలాలను సైతం వేటాడుతుందా అన్న చర్చ ఊపందుకుంది.
అధికారం అండదండలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా రాజ్యం ఏలుతున్నది. స్వయంగా సిఎం కుటుంబమే ఇసుక మాఫియాను నడుపుతున్నట్లు విపక్షాలు స్ట్రాంగ్ గా విమర్శలు గుప్పిస్తున్నాయి. మంత్రి కెటిఆర్ ఇసుక మాఫియా డాన్ అన్న ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ విషయంలో టిఆర్ఎస్ ఏకాకి అయింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కెటిఆర్ ఇసుక మాఫియా డాన్ అని ఆరోపించింది. అదే వరుసలో టిడిపి, బిజెపి, లెఫ్ట్, తెలంగాణ జెఎసి, తుదకు మావోయిస్టు పార్టీ కూడా ఇసుక మాఫియా డాన్ కేటిఆరే అని ఆరోపణలు చేశాయి.
విపక్షాలన్నీ మూకుమ్మడి దాడి చేయడంతో తెలంగాణ సర్కారు ఇరకాటంలో పడింది. పది మంది దళిత కుటుంబాలను అక్కడి పోలీసులు టార్గెట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సందర్భంలో ఆ విషయమే తనకు తెలియదన్నట్లు ప్రభుత్వ పెద్దలు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దీనిపై పోరాటం నడుపుతున్నది. జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సిరిసిల్ల థర్డ్ డిగ్రీ ఘటన చేజారిపోతుందనుకున్న తరుణంలో మంత్రి కెటిఆర్ రంగంలోకి దిగారు. నేరెళ్ల బాధితులను వేములవాడ ఆసుపత్రిలో మీడియా లేకుండా వెళ్లి పరామర్శించి వచ్చారు.
అయినా ఆందోళన సద్దుమణగలేదు. మరోవైపు రాజ్యాంగబద్ధమైన సంస్థలు కూడా రంగంలోకి దిగే ఆనవాళ్లు కనిపించడంతో సర్కారు మరో స్టెప్ వేసింది. తాజాగా సిసిఎస్ ఎస్సై రవీందర్ ను సస్పెండ్ చేసింది సర్కారు. ఆ ఎస్సై రవీందర్ లాకప్ లో దళితులను వేధింపులకు గురిచేసినట్లు విచారణలో నిజాలు బయటపడ్డాయని, అందుకే అతనిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వరంగల్ రేంజి ఐజి నాగిరెడ్డి వెల్లడించారు.
ఇక దీనిపై మంత్రి కెటిఆర్ ట్విట్ చేశారు. డిఐజి నివేదిక ఆధారంగా ఎస్సై పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ కేసులో తూ.తూ.మంత్రంగానే చర్యలు తీసుకుని సర్కారు చేతులు దులుపుకునే యోచనలో ఉన్నట్లు తేలిపోయిందంటున్నాయి విపక్షాలు.
సిసిఎస్ ఎస్సై రవీందర్ ను సస్పెండ్ చేశారు సరే. మరి ఎస్పీ సంగతేంటి?
అక్కడి జనాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ ముక్తకంఠంతో ఎస్పీని సస్పెండ్ చేయాలి, ఎస్పీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్న బలమైన డిమాండ్ ను లేవనెత్తుతున్నాయి?
ఎస్పీ విషయంలో తెలంగాణ సర్కారు ఏం చర్యలు తీసుకోనున్నది?
ఎస్పీ పై అసలు చర్యలు ఉంటాయా? ఉండవా?
ఎస్సైని సస్పెండ్ చేశారు సరే, మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తారా లేదా?
ఇసుక మాఫియా డాన్ అని ఆరోపణలు కెటిఆర్ మీద వస్తున్నాయి కాబట్టి న్యాయ విచారణ చేయాలన్న డిమాండ్ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. దాని మీద ఏం చేయబోతున్నది సర్కారు?
దళితులను టార్గెట్ చేశారనడంలో అర్థం లేదన్న సిఎం, మంత్రి కెటిఆర్ ఇద్దరు 20 రోజులకు పైగా ఎందుకు చర్యలు తీసుకోకుండా తాత్సారం చేశారు?
ఇసుక లారీలు వేగం కారణంగా పది మంది వరకు చనిపోయారని ప్రజాసంఘాలు చెబుతున్నాయి. మరి వారి కుటుంబాలను ఎలా ఆదుకుంటారు?
ఒకే నెంబరు ప్లేట్ తో అనేక లారీలు నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. వాటిపై ఏరకమైన చర్యలుంటాయి?
థర్డ్ డిగ్రీ పేరుతో పోలీసులు వేధించిన కుటుంబాలను ఎలా ఆదుకుంటారు?
ఇసుక లారీలు కాలబెట్టిన పాపానికే పోలీసులు అంతగా రెచ్చిపోయి చిత్రహింసలకు గురిచేయడానికి తెర వెనుక బలమైన కారణాలేమైనా ఉన్నాయా?
దళితులే కాదు బిసిలు కూడా బాధితుల జాబితాలో ఉన్నారని చెబుతున్నారు. మరి వారికి ఏరకమైన న్యాయం చేస్తారు?
ఇసుక ఆదాయం భారీగా పెరిగిందని, అలాంటప్పుడు మాఫియా లేనే లేదని చెబుతున్న సర్కారు పెద్దలు దీనిపై సిబిఐ విచారణ చేయాలన్న డిమాండ్ పై స్పందిస్తారా?
కెసిఆర్ కుటంబసభ్యులంతా ఇసుక దందాలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఏరకమైన విచారణ జరుపుతారు?
ఇసుక మాఫియా, నేరెళ్ల దిళితులపై పోలీసుల దాడుల తర్వాత సర్కారు ఉక్కిరి బిక్కిరైతున్న తరుణంలో గత రెండు రోజులుగా మంత్రి కెటిఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. వేములవాడ వెళ్లి బాధితులను దావాఖానాలో పరామర్శించారు. అనంతరం హైదరాబాద్ లో మీడియా మిత్రులను పిలిపించుకుని చిట్ చాట్ చేసి తప్పు ఒప్పులను చర్చించారు. అయినప్పటికీ సర్కారు మీద వత్తిడి మాత్రం తగ్గిన వాతావరణం కనిపిస్తలేదు. ఎస్పీపై చర్యలు తీసుకుంటే తప్ప నేరెళ్ల చిచ్చు రగులుతూనే ఉండే అవకాశం ఉంది.