హుస్నాబాద్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తగలనుంది. 100 మంది గౌరవెల్లి నిర్వాసితులు ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నామినేషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే, కాంగ్రెస్ టికెట్ పై ఈ సారి బలమైన నేత పొన్నం బరిలోకి దిగుతున్నారు.
హుస్నాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్ విభిన్న రాజకీయ, భౌగోళిక ప్రత్యేకతులున్న నియోజకవర్గం. గతంలో ఇక్కడ వామపక్షాల ప్రభావం అత్యధికంగా ఉండేది. ఆసియాలోనే రెండో అతిపెద్ద అమరవీరుల స్థూపం(ఇప్పుడు లేదు) ఇక్కడ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సీపీఐ పోటీ చేయడానికి ఆసక్తి చూపే ఈ నియోజకవర్గానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కెప్టెన్ లక్ష్మీకాంత రావు వారసుడు వొడితెల సతీశ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హుస్నాబాద్‌లో ప్రధానంగా వామపక్షాలకు, కాంగ్రెస్‌కు మధ్య పోటీ ఉండేది. తెలంగాణ తర్వాత బీఆర్ఎస్ ఇక్కడ జెండా ఎగరేసింది.
వొడితెల సతీశ్ కుమార్ మరోసారి ఇక్కడి నుంచి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. వివాదరహితుడిగా పేరున్న వొడితెల సతీశ్ కుమార్ ఈ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉన్నది. ఆయన కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉన్నది. సీఎం కేసీఆర్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికలో మాత్రం వొడితెలకు కఠిన సవాళ్లు ఎదురువుతున్నాయి. ఇక్కడి నుంచి వొడితెల సతీశ్ కుమార్ మరోసారి గెలుపొంది తీరుతారని బీఆర్ఎస్ వర్గాలు ధీమాతో ఉన్నాయి.
గౌరవెల్లి ఫ్యాక్టర్:
హుస్నాబాద్ ఇటీవల కాలంలో గౌరవెల్లి నిర్వాసితుల సమస్యతో మీడియాలో ప్రధాన శీర్షికల్లోకి వచ్చింది. తమకు పూర్తి పరిహారం అందించలేదని, తమకు అన్యాయం చేశారని గౌరవెల్లి నిర్వాసితులు భావిస్తారు. బలవంతంగా వారిని గ్రామాల నుంచి తరలించడం ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామని, లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని కేసీఆర్ ఇటీవలే హుస్నాబాద్ సభలో ప్రకటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందిస్తామనే అంశాన్ని ప్రధానంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. ఈ ప్రాజెక్టు ద్వారా తాము తీవ్రంగా నష్టపోయామని నిర్వాసితులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్. ఈ సారి కూడా ఎన్నికల ప్రచారాన్ని ఆయన ఇక్కడి నుంచే ప్రారంభించారు. సతీశ్ కుమార్‌ను గెలిపించాలని కోరారు. కానీ, గౌరవెల్లి నిర్వాసితులు మాత్రం బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. వంద మంది గౌరవెల్లి నిర్వాసితులు ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పోటీలో నిలబడటమే కాక, నియోజకవర్గంలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఎమ్మెల్యేపై వ్యతిరేకతను ప్రచారం చేసే నిర్ణయమూ ఉన్నట్టు తెలిసింది.
గౌరవెల్లి నిర్వాసితుల నిర్ణయం బీఆర్ఎస్‌కు ఇబ్బందికరమైన అంశమే. అంతేకాదు, కాంగ్రెస్ అభ్యర్థి వీరికి అండగా నిలబడి నిర్వాసితుల ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
Also Read: హుస్నాబాద్ బీజేపీలో త్రిముఖ పోరు!.. బరిలోకి దిగేది ఎవరు?
ధీటుగా కాంగ్రెస్:
ఈ సారి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై సీనియర్ లీడర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బరిలోకి దిగుతున్నారు. నాన్ లోకల్ అనే ముద్రను చెరపేసుకోవడానికి హుస్నాబాద్‌కు మకాం మార్చుకున్నారు. స్థానికంగా ప్రచారం ముమ్మరం చేశారు. ఇక్కడ వామపక్షాల ఓట్లు కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే, మాస్ లీడర్‌గా పొన్నంకు ఛరిష్మా ఉన్నది. ఓట్లు చీలిపోయే అవకాశాలు స్వల్పంగా ఉండటం, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వొడితెల సతీశ్ కుమార్‌కు సహజంగా ఎదురయ్యే వ్యతిరేకత పొన్నం ప్రభాకర్‌కు కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి.
బరిలో బీజేపీ!
ఈ సారి బీజేపీ కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నది. అయితే, హుస్నాబాద్ టికెట్ కేటాయింపులోనే పంచాయితీ జరుగుతున్నది. ఈటల మద్దతు జేఎస్ఆర్‌కు, బండి సంజయ్ మద్దతు బొమ్మ శ్రీరాం చక్రవర్తికి ఉన్నాయి. ఇటీవలే రెండో జాబితాలో తన మద్దతుదారులకు టికెట్లు ఇవ్వలేదని బండి బాధపడినట్టు తెలిసింది. హుస్నాబాద్ టికెట్ పెండింగ్‌లో పెట్టడంపైనా అసంతృప్తితో ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. హుస్నాబాద్ బీజేపీ టికెట్ పోరులో వీరిద్దరితోపాటు సామాజిక సేవకురాలిగా పేరు సంపాదించుకుంటున్న కర్ణకంటి మంజుల ఉన్నారు.