పరువు తీసుకోవడానికి తెలంగాణకు వచ్చాడా : డీకే శివకుమార్‌కు సీఎం కేసీఆర్ కౌంటర్

By Siva Kodati  |  First Published Oct 29, 2023, 5:50 PM IST

పదేళ్ల నుంచి అధికారంలో లేక కాంగ్రెస్ ఆకలితో వుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చురకలంటించారు .  24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు ఇస్తున్నామని చెబుతున్నాడని కేసీఆర్ ఫైర్ అయ్యారు . డీకే శివకుమార్ ప్రచారం కోసం వచ్చారా.. ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చారా అని సీఎం ప్రశ్నించారు . 


పదేళ్ల నుంచి అధికారంలో లేక కాంగ్రెస్ ఆకలితో వుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చురకలంటించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు . తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆలేరులో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లు డీకే శికుమార్ మనకు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని ఆనాడు అన్నారని దుయ్యబట్టారు. 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు ఇస్తున్నామని చెబుతున్నాడని కేసీఆర్ ఫైర్ అయ్యారు. డీకే శివకుమార్ ప్రచారం కోసం వచ్చారా.. ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చారా అని సీఎం ప్రశ్నించారు. 

మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తే ససేమిరా అన్నానని కేసీఆర్ తెలిపారు. సునీత తన బిడ్డ లాంటిదని.. ఆమె అడిగిన హామీలు నెరవేరుస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా వుండేది.. ఇప్పుడు ఎలా వుందని సీఎం ప్రశ్నించారు. మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసుకున్నామని.. 24 గంటల కరెంట్ ఇస్తే లోడ్ పడదని అధికారులను ఒప్పించానని కేసీఆర్ వెల్లడించారు. 24 గంటలు కరెంట్ అవసరం లేదని.. 3 గంటలు సరిపోతుందని పీసీసీ ప్రెసిడెంట్ అంటున్నాడని సీఎం చురకలంటించారు. 

Latest Videos

ALso Read: అప్పుడు మా సపోర్ట్‌తో అధికారంలోకి .. మాకే సుద్ధులు చెబుతారా : డీకే శివకుమార్‌కు కేసీఆర్ కౌంటర్

రైతుబంధును దశలవారీగా పెంచుకుంటూ వెళ్తామన్నారు. ఒకప్పుడు రైతు కొడుక్కి పిల్లను కూడా ఇచ్చేవారు కాదని కేసీఆర్ గుర్తుచేశారు. ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. ధరణిని తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని సీఎం ప్రశ్నించారు. అందరి సంక్షేమం గురించి ఆలోచించే పార్టీకి ఓటేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం ఇస్తే మీకు పరిపాలన చేసుకోవడం చేతకాదని అవహేళనగా మాట్లాడారని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణలో తప్పించి.. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రం గుజరాత్‌లోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసలు, కరువు పరిస్ధితులు వుండేవన్నారు. కాంగ్రెస్ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు టపాసుల మాదిరిగా పేలుతూ వుండేవని చురకలంటించారు. 24 గంటల కరెంట్ కావాలా.. 3 గంటల కరెంట్ కావాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ మళ్లీ గెలవాల్సిందేనని సీఎం పేర్కొన్నారు. రైతుబంధు వృథా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని.. తెలంగాణ రాకముందే 40 లక్షల టన్నులు ధాన్యం పండేదని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తోందని కేసీఆర్ వెల్లడించారు. గతంలో పట్టాదారు పాసు పుస్తకం కావాలంటే ఏడాది సమయం పట్టేదని.. 

బీఆర్ఎస్ హయాంలో గ్రామాలు ప్రశాంతంగా వున్నాయని.. తానూ రైతునే కాబట్టి రైతుల బాధలు తెలుసునని సీఎం తెలిపారు. అందుకే రైతుబంధు, రైతు బీమా తెచ్చానని కేసీఆర్ పేర్కొన్నారు. భూ వివాదాలు ఉండకూడదనే ధరణి పోర్టల్ తీసుకొచ్చామని సీఎం తెలిపారు. 

click me!