శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్ కొనసాగుతుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టును పేల్చివేస్తామని ఆగంతకుడు మెయిల్ చేయడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది , క్విక్ రెస్పాన్స్ టీమ్ ఎయిర్ పోర్టును జల్లెడ పట్టారు.
ఎయిర్ పోర్టును భద్రతా సిబ్బంది, బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తున్నారు.ఇదిలా ఉంటే బెదిరింపు మెయిల్ వచ్చిన కొద్దిసేపటికే తన కుమారుడి మానసిక పరిస్థితి బాగా లేదని క్షమించాలని మరో మెయిల్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చింది.
ఈ రెండు మెయిల్స్ కూడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ రెండు మెయిళ్లపై అధికారులు విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎలాంటి బాంబు లేదని భద్రతా సిబ్బంది తేల్చారు.
తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు ఉందని మెయిల్ వచ్చిన రెండు గంటల తర్వాత లూట్@జీమెయిల్.కామ్ పేరుతో శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమర్ సపోర్ట్ మెయిల్ కు మరో మెయిల్ వచ్చింది. తన కొడుకు మానసిక పరిస్థితి బాగా లేదని ఆ మెయిల్ లో పేర్కొన్నారు. ఈ కారణంగానే బాంబు బెదిరింపును ఆ మెయిల్ లో పేర్కొన్నారు.
ఈ నెల 15 నుండి 30వ తేదీ వరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆంక్షలు కొనసాగుతాయి. స్వాతంత్ర్య దినోత్సవం ముందు నుండి రేపటి వరకు ఈ ఆంక్షలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా సిబ్బంది మరింత అలెర్టయ్యారు. ఈ మెయిల్ పంపిన వారెవరనే విషయమై తేల్చేందుకు భద్రతా సిబ్బంది కసరత్తును ప్రారంభించారు.