
భూముల కుంభకోణంలో కాంగ్రెస్ నేతల ప్రమేయంతోపాటు, టిఆర్ఎస్ నాయకుల పాత్రపై కూడా సిబిఐ విచారణ జరిపించడానికి మంత్రి హరీష్ రావు సిద్ధమా అని శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకుల ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు బయటపెడతానంటూ మంత్రి హరీష్ రావు ప్రకటనలు చేయడం స్వాగతించదగ్గదే అన్నారు. వీటిని సిబిఐకి అప్పగించాలని డిమాడ్ చేశారు. తాము సైతం ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ఆధారాలను సిబిఐకి అప్పగిస్తామన్నారు. వాస్తవాలేమిటో విచారణలో బయటపడతాయన్నారు.
ప్రతి విషయానికి కాంగ్రెస్ వారిని బదనాం చేయడం టిఆర్ఎస్ నాయకులకు అలవాటై పోయిందని విమర్శించారు. ప్రభుత్వ తీరు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని రీతిలో ఉందన్నారు. శాసనమండలిలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ పొంగులేటి సుధాకర రెడ్డి తో కలిసి సిఎల్పి కార్యాలయంలో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు.
ఒక్క గజం కూడా పోలేదంటూ సవాల్ చేస్తున్న సిఎం గారు, అదే విషయాన్ని సిబిఐ విచారణలో నిరూపించడానికి ఎందుకు వెనకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి అంశంలో ముందుగా లీకులివ్వడం, తరువాత వాటిని తుస్సుమనిపించడం, నిందితులను తప్పించడమనేది కెసిఆర్ హయాంలో అనేక సార్లు రుజువైందన్నారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నియమించిన ఎస్ కె సిన్హా కమిటీ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలన్నారు. ఈ నివేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచేలా పబ్లిక్ డోమైన్ లో ఉంచాలని డిమాండ్ చేశారు. నిజాయితీతో వ్యవహరించే అధికారిని ఎందుకు తప్పించారని సూటిగా అడిగారు.
మంత్రి కెటిఆర్ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని ఆయన తన నోరును అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.