కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్, బీజేపీపై విమర్శల దాడిని కొనసాగించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ లూటీ చేసిన ధనాన్ని వెనక్కి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
ఆర్మూర్:పదేళ్లుగా కేసీఆర్ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజల డబ్బును తిరిగి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో శుక్రవారంనాడు జరిగిన కార్నర్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.రైతులకు ఎంత డబ్బు ఇస్తే దేశం అంతా బలపడుతుందన్నారు. సోనియా గాంధీ మీ కోసం తెలంగాణ ఇచ్చారన్నారు.ప్రతి ఏటా రైతులకు రూ. 15 వేల నగదును అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సోనియా మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్ రూ. 4 వేలకు పెంచుతామన్నారు. గ్యాస్ సిలిండర్ ను రూ. 500లకు అందిస్తామన్నారు.ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ. 2500 జమ చేస్తామన్నారు.
undefined
కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో తెలంగాణ బందీ అయిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే సాగుతున్నాయన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పే మాటలకు విలువ లేదని ఆయన ఎద్దేవా చేశారు.పసుపు బోర్డు గురించి బీజేపీ నేతలు మాటలే చెబుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. పసుపు రైతులకు రూ. 12 -15 వేల మద్దతు ధర ఇస్తామని చెప్పారు.
కొంతకాలం క్రితం వరకు తెలంగాణ బీజేపీ నేతలు బాలీవుడ్ హీరోలుగా తిరిగే వారన్నారు. కానీ, పరిస్థితులు మారాయన్నారు. బీజేపీ నేతలకు తెలియకుండానే ఆ పార్టీ పని అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ బీజేపీ నుండి తమ పార్టీలో చేరేందుకు వస్తున్న నేతలు తమకు అవసరం లేదని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని ఆయన ఆరోపించారు.తాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. అయితే తనపై 24 కేసులు బనాయించారన్నారు. తన ఎంపీ సభ్యత్వం రద్దు చేసిన వెంటనే తన ఇంటిని కూడ ఖాళీ చేయించారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
ప్రతిపక్ష సీఎంల వెంట ప్రధాని నరేంద్ర మోడీ వెంటాడుతాడన్నారు. కానీ కేసీఆర్ పై నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పార్లమెంట్ లో చేసే ప్రతి చట్టానికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని ఆయన ఆరోపించారు. బీజేపీతో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో పరస్పరం పోటీ చేస్తుందో ఆ రాష్ట్రంలో ఎంఐఎం పోటీ చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ ను ఓడించి బీజేపీకి సహాయం చేసేందుకే ఎంఐఎం పోటీ చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు.
కేసీఆర్ ఎంత అవినీతి చేసినా ఎలాంటి కేసులుండవన్నారు.కేసీఆర్, మోడీది గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ చేస్తారని రాహుల్ సెటైర్లు వేశారు.తమ కుటుంబం ఏళ్ల నుండి ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీని అన్ని రాష్ట్రాల్లో ఓడిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ను, మధ్యప్రదేశ్, రాజస్థాన్,చత్తీస్ ఘడ్ లలో బీజేపీ ఓడిస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేల ఇంటి తలుపులు పార్టీ కార్యకర్తలు, ప్రజల కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారు.