బండికి బీజేపీ అధిష్టానం బ్రేక్? ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా?

By Mahesh K  |  First Published Oct 20, 2023, 5:04 PM IST

బండి సంజయ్‌కు కరీంగనర్ అసెంబ్లీ టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనే చర్చ మొదలైంది. ఆయనను ఛత్తీస్‌గడ్ స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ అధిష్టానం నియమించడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 


హైదరాబాద్: బండి సంజయ్ దూకుడుకు బీజేపీ అధిష్టానం బ్రేకులు వేస్తున్నదా? ఆయన సారథ్యంలో తెలంగాణ బీజేపీ దూసుకుపోతుండగా.. అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించారు. జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నా ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం పార్టీ క్యాడర్‌ కూడా జీర్ణించుకోలేదు. ఇలాంటి సందర్భంలోనే మరో వాదన తెరపైకి వస్తున్నది. బండి సంజయ్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలపడం లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి.

తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయాల్సి ఉన్నది. బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీకి అధిష్టానం అనుమతిస్తే సంతోషంగా పోటీ చేస్తానని ఇది వరకే ప్రకటించారు. ప్రచారాన్ని కూడా ఆయన ప్రారంభించారు. కానీ, ఇంతలోనే అధిష్టానం తీసుకున్న నిర్ణయం బండి సంజయ్‌కు బ్రేకులు వేసినట్టుగానే కనిపిస్తున్నది.

Latest Videos

ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్‌ను బీజేపీ నియమించింది. దీంతో ఆయన ఛత్తీస్‌గడ్ క్యాంపెయిన్‌లో బిజీగా ఉండాల్సి వస్తున్నది. అయితే.. తెలంగాణలో కరీంనగర్‌లో ప్రచారానికి బండి సంజయ్‌కు పెద్దగా సమయం దొరక్కపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. స్టార్ క్యాంపెయినర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించి కరీంనగర్‌లోనూ బండి సంజయ్ ప్రచారం చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు. ఛత్తీస్‌గడ్ స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేసినంత మాత్రానా ఆయన అసెంబ్లీ టికెట్ ఇవ్వదనే నిబంధన ఏమీ లేదని కూడా వివరిస్తున్నారు.

Also Read: రష్యా, భారత్, మధ్యలో చైనా.. చమురు దిగుమతుల లావాదేవీల్లో యువాన్ మెలిక

బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.

తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. నవంబర్ 7వ తేదీ, 17వ తేదీన రెండు దశల్లో ఛత్తీస్‌గడ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీప తేదీల్లోనే ఉండటంతో ఛత్తీస్‌గడ్ స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్‌ను ఎంపిక చేయడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

click me!