టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి , కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్‌లో చేరారు . నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి.. డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసురుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్షాల కళ్లు ఎర్రబడుతున్నాయని దుయ్యబట్టారు. ఒకప్పుడు మైగ్రేషన్‌కు కేరాఫ్‌గా వున్న మహబూబ్‌నగర్ జిల్లా ఇఫ్పుడు ఇరిగేషన్‌కు కేరాఫ్‌గా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేశామని.. ఎన్నికల్లోపు మిగిలిన అందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 13 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ నగదు అందజేశామని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని.. గురుకులాల్లో 6.50 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. సముద్ర తీరం లేకుండా మత్స్స సంపద పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణదే అగ్రస్థానమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని.. రైతుబంధు కింద రూ.73 వేల కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. తెల్ల రేషన్ కార్డు వున్న వారికి సన్నబియ్యం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 11 సార్లు ఛాన్స్ ఇస్తే.. కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేసిందని కేటీఆర్ నిలదీశారు.
ALso Read: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై కేటీఆర్ కామెంట్.. ‘ఐరాస వెంటనే జోక్యం చేసుకోవాలి’
అంతకుముందు కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్‌లో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ నేతలందరూ తిరిగి బీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. బాలకృష్ణారెడ్డి.. తొందరపడి 2009లో పార్టీని వీడి వెళ్లిపోయారని, ఇప్పుడు సొంతింటికి చేరుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి.. డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసురుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్లుగా వుందన్నారు. సోనియా, రాహుల్‌లను నానా మాటలు అంది రేవంత్ రెడ్డేనని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ఎన్నో బాధలు పెట్టి తెలంగాణ ఇచ్చిందని.. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని కేటీఆర్ చురకలంటించారు. వందలమంది తెలంగాణ బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మండిపడ్డారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదన.. రాష్ట్ర ప్రజలకు ఏ టీమ్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.