
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. నిఖిత అనే విద్యార్థిని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల - కళాశాలలో ఏడవ తరగతి చదువుకుంటోంది. ఆమెకు మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో ఏవో మనస్పర్ధలు ఉన్నట్లుగా.. ఈ నేపథ్యంలో కాస్త ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయం స్కూల్ టీచర్లకు తెలియడంతో నిఖితకు, తోటి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా తెలిసింది. కౌన్సిలింగ్ తరువాత విద్యార్థులు అప్పటికి అక్కడ నుంచి వెళ్లారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. సాయంత్రానికి ఆ విద్యార్థిని క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం సాయంత్రం మిగతా విద్యార్థులంతా గ్రౌండ్లో ఆడుకుంటున్న సమయంలో ఆమె మాత్రం ఒక్కతే క్లాస్ రూమ్ లోకి వెళ్ళింది. అక్కడే చున్నితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
విద్యార్థిని చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె బంధువులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు. క్లాస్ టీచర్ వేధింపుల కారణాంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ లో జరుగుతున్న ఘటనల మీద చాలాసార్లు ఫిర్యాదు చేశామని.. అయినా చర్యలు తీసుకోవడం లేదని మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
చెరుకు సుధాకర్‌కు బెదిరింపులు: నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు
గ్రౌండ్ టైంలో ఇద్దరు విద్యార్థులు గొడవపడ్డారని... దీంతో స్టూడెంట్ నికిత సూసైడ్ చేసుకుందని ప్రిన్సిపల్ చెబుతున్నారు. ఈ ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా, విద్యార్థిని ఎందుకు చనిపోయింది దీని వెనుక ఉన్న కారణాలేంటి అనేది పోలీసులు విచారణ అనంతరమే వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, అత్యాచార బాధితురాలైన మైనర్ బాలిక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఉత్తరప్రదేశ్ లో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనమీద ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని ఆమె చేసిన ఆరోపణలు అబద్దం అని ఇన్‌స్పెక్టర్ అనడంతో మనస్తాపంతో ఆ బాలిక డీజీపీ ఆఫీసులోనే విషం తాగింది. ఇది గమనించిన వారు వెంటనే హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు.
సోమవారం ఈ ఘటన జరిగింది. దీనిమీద బాలిక సోదరి తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలి మీద అత్యాచార ఘటన విషయంపై చర్య తీసుకోవాలని కోరుతూ వారు బరేలీ జోన్, ఏడీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వారు తమ గోడు వెళ్లబోసుకున్నప్పుడు.. అక్కడున్న ఒక ఇన్స్పెక్టర్ అది తప్పుడు కేసు అని పేర్కొన్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె విషపూరితమైన పదార్థాన్ని సేవించిందని ఆమె సోదరి పేర్కొంది.
పోలీస్ సూపరింటెండెంట్ (నగరం) రాహుల్ భాటి మాట్లాడుతూ, బాలిక తన దరఖాస్తుపై చర్య తీసుకోవాలని కోరుతూ ఏడీజీపీ కార్యాలయానికి వచ్చిందని, అక్కడే విషం సేవించిందని తెలిపారు. పిలిభిత్ నివాసి అయిన 17 ఏళ్ల బాధితురాలు తన సోదరితో కలిసి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆరు నెలల క్రితం ఆమె మీద వారి పొరుగింటి వ్యక్తి, అతని స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడని బాలిక సోదరి ఆరోపించింది. ఈ విషయమై సుంగరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వారు నేరుగా ఏడీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నం ఘటన జరిగిన సమయంలో ఏడీజీ పీసీ మీనా తన కార్యాలయంలో లేరని పోలీసు వర్గాలు తెలిపాయి.