
ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై ములుగు సీతక్క బాధపడ్డారు. ఎర్రబెల్లి దయన్న ఇంతటి నీచ రాజకీయాలు చేస్తడనుకోలేదని ఆవేదన చెందారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలకు నిరసనగా ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు సీతక్క. ఆమె పత్రికా ప్రకటనలో పేర్కొన్న అంశాలను ఉన్నది ఉన్నట్లు ఇస్తున్నాం.
నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఎర్రబెల్లి!
తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, నిరంకుశ విధానాలు, నియంతృత్వపోకడలను వ్యతిరేకించేందుకు బలమైన రాజకీయ పునరేకీకరణ అవసరమని ప్రతి ప్రజాస్వామ్యవాదికీ తెలుసు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ వైపు వెళ్లడం జరిగింది. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను తొక్కేస్తున్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి రాచరికపు పోకడలకు తెరతీసారు. నేను డబ్బుల కోసమో, పదవీ వ్యామోహంతోనో వెళ్తే టీఆర్ఎస్ లోకి వెళ్లాలి. కానీ నేను ప్రజాసమస్యల కోసం పోరాడాలనుకున్నాను. అందుకు బలమైన వేదికగా తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చి కేసీఆర్ చేతిలో మోసపోయిన కాంగ్రెస్ పార్టీ సరైనదని అనుకున్నాను.
ప్రజా ఆలోచనలకు అనుగుణంగా నేను కాంగ్రెస్ లో చేరాను. గత మూడేళ్లుగా ఎన్నో అవాంతరాలు వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, జైల్లో పెట్టినా మడమతిప్పకుండా ప్రజా పోరాటాలు చేస్తూ కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి. . ఆయన కాంగ్రెస్ లో చేరడంతో ప్రజలకు భరోసా, ప్రజాస్వామిక వాదులకు భవిష్యత్ పట్ల నమ్మకం ఏర్పడింది. అంతేగానీ దయాకర్‌రావు గారిలా మూటల కోసమో, పదవుల ఆశతోనో పార్టీ మారలేదు. రేవంత్ రెడ్డి కుటుంబం నన్ను తమ సొంత ఆడబిడ్డలా భావిస్తోంది. మూడేళ్లుగా ఆయనతో కలిసే ప్రజాపోరాటాలు చేశాను. ఆ క్రమంలోనే ఆయన కుటుంబంతో అనుబంధం ఏర్పడింది అదే ఉద్ధేశంతో నేను కూడా రేవంత్ తో కలిసి కాంగ్రెస్ లో చేరాను..
అంత మాత్రాన ఎర్రబెల్లి దయాకర్ రావు నీచమైన భాషను వాడటం తగదు. ఆ విషయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇలాంటి కుయుక్తులు, నీచపు వ్యవహారాలు ఎర్రబెల్లికి కొత్త కాదు. ఎర్రబెల్లి మాటల వెనుక కుట్ర ఉన్నదన్న అనుమానం కలుగుతోంది. ప్రజల ఆకాంక్ష మేరకు శరవేగంగా జరుగుతోన్న రాజకీయ పునరేకీకరణను విచ్చిన్నం చేసే కుట్ర కనిపిస్తోంది. కేసీఆర్ వ్యతిరేకశక్తులు ఐక్యం కాకుండా వాళ్ల మధ్య అనుమానపు బీజాలు నాటే దురుద్ధేశంతోనే ఎర్రబెల్లి మాట్లాడినట్టు అనిపిస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన, నిరంకుశ విధానం, ప్రజాస్వామిక హక్కుల హననానికి వ్యతిరేకంగా ప్రజలంతా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే రాచరికపు పోకడలను జనం ఏ మాత్రం సహించే స్థితిలో లేరు ఇలాంటి కుయుక్తలకు వెరవకుండా తెలంగాణ ప్రజల హితం కోసం బలమైన రాజకీయ పునరేకీకరణ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తాం.
- సీతక్క (ధనసరి అనసూయ )
టిడిపి పొలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు,
ములుగు మాజీ ఎమ్మెల్యే.
(సీతక్క మీడియాకు విడుదల చేసిన లెటర్ కింద ఇస్తున్నాం)
కోదండరాం తో చేతులు కలిపిన టిడిపి తమ్ముళ్లు
ఈ వీడియో తోపాటు మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి