
పోలీసుల నిఘా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో దొంగలు కూడా కొత్త కొత్త మార్గాలను వెతుకుతున్నారు. గతంలో రైళ్లలో దోపిడీకి పాల్పడేవారు నిర్మానుష్య ప్రాంతంలో చైనులాగి రైలును ఆపేవారు. ఆపై కత్తులు, మారణాయుధాలతో (robbery in trains) ప్రయాణీకులను బెదిరించి దోచుకునేవారు. అయితే రైల్వే పోలీసులతో పాటు రాష్ట్రాల పోలీసులు సైతం భద్రతను కట్టుదిట్టం చేయడంతో వీరి ఆటలు సాగడం లేదు.
తాజాగా రైల్వే ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాను సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు (secunderabad railway police ) అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని (maharashtra) షోలాపూర్‌కు (solapur) చెందిన శ్రీనివాస్ దశరథ్ శ్రీపతి (33) పుణెలోని హోటళ్లలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే అతను రైల్వే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్నాడు. దీనిలో భాగంగా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకుని రైలు ఎక్కేవాడు. ప్రయాణికులు నిద్రలో ఉండగా దొంగతనాలకు పాల్పడుతూ వుండేవాడు.
Also Read:కేవలం 15 నిమిషాల్లో రూ.కోటి దొంగతనం.. బంగారం దుకాణంలోకి ప్రవేశించి..!
ఈ క్రమంలో అక్టోబర్ 18న మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలి బ్యాగులోని 80 గ్రాముల బంగారు నగలు, రూ.లక్ష నగదు దొంగిలించాడు. తన వస్తువులు, నగదు కనిపించకపోవడంతో బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు నేరాలు బయటపడ్డాయి. తాజాగా మచిలీపట్నం రైలులోని (machilipatnam express) ప్రయాణీకురాలి వద్ద దొంగిలించిన నగలను సిద్దిఅంబర్ బజార్‌లోని సిద్ధనాథ్ బంగారు దుకాణ నిర్వాహకుడు రమేష్ ఏకనాథ్ షిండే(44)కు విక్రయించినట్లుగా అంగీకరించాడు. దీంతో వారిద్దరి వద్ద నుంచి 12 తులాల బంగారు నగలు, రూ.1లక్ష నగదు, 3సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకు ఇద్దరిని రిమాండుకు తరలించారు.